గద్వాలలో హనీట్రాప్‌ కలకలం!.. ఫోన్‌లో 150 మంది మహిళల ఫొటోలు

Gadwal Honey Trap Blackmailing Women Photos Videos VIral - Sakshi

మహిళలను లోబర్చుకుని బ్లాక్‌మెయిల్‌ 

సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోల వైరల్‌ 

ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన వారే కీలకపాత్రధారులు? 

నాయకుల మధ్య విభేదాలతో వెలుగులోకి.. 

సాక్షి, గద్వాల రూరల్‌: ప్రధాన నగరాలకే పరిమితమైన హనీట్రాప్‌ విష సంస్కృతి ఇప్పుడు గద్వాలకు పాకింది. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనాయకులు ఉన్నారన్న విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు యువ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలతో కొందరు మహిళలకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు వెలుగు చూసినట్లు సమాచారం. ఇవన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. 

పోలీసుల అదుపులో ఇద్దరు.. 
ఈ ఘటనపై జిల్లా పోలీసు బాస్‌ తీవ్రంగా స్పందించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యువ నాయకుల కదలికలపై రహస్యంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే శుక్రవారం వెంకంపేట మార్గంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ వద్ద ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట వీరిని రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి రహస్యంగా ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో వంద నుంచి 150 మంది మహిళల ఫొటోలు, వివరాలు ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి పూర్తి వివరాలను పోలీసులు తమదైన శైలిలో కూపీ లాగుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు గద్వాల పట్టణంలో ఏనోట విన్నా ఇదే విషయంపై చర్చ సాగుతుంది. 

విచారణ చేస్తున్నాం 
ఈ వ్యవహారం చాలా సున్నితమైన అంశం. లోతుగా విచారణ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చట్టవిరుద్ధమైన వ్యవహారాలను సహించేది లేదు. ఇందులో ఎలాంటి పైరవీలకు తావు లేదు. బాధితులు ఎవరైనా ముందకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేస్తాం.        – రంజన్‌రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల   

విభేదాలతోనే.. 
ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు కొంతకాలంగా కొందరు అమాయక మహిళలను లోబర్చుకుని వారితో వాట్సప్‌లో అశ్లీలంగా మాట్లాడడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. వీరంతా ఒకే గ్యాంగ్‌గా ఉంటూ లోబర్చుకున్న మహిళల అశ్లీల ఉన్న ఫొటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ ముగ్గురు కూడా సదరు మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు నాయకుల్లో ఒకరికి సంబంధించిన బంధువు మహిళ అశ్లీల ఫొటో కనిపించింది. దీంతో ముగ్గురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది.

రెచ్చినపోయిన సదరు ముగ్గురు యువనాయకులు తమ వద్దనున్న మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త వెలుగు చూడడంతో పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో సదరు యువ నాయకులు నష్టనివారణ చర్యలకు దిగారు. తమకున్న పలుకుబడి నాయకుల శరణు కోరారు. విషయం పోలీసు కేసుల వరకు వెళ్లకుండా చూడాలంటూ పైరవీలు చేశారు. అయితే ఈ వ్యవహారం మహిళలకు సంబంధించి కావడంతో ఆ ప్రధాన నేత యువ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top