
సాక్షి, మహబూబ్‌నగర్: గతంలో హైదరాబాద్ పోలీస్ మాజీ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ పేరుతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా కొందరు పోలీసులకు ఫోన్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. అలాగే కొందరు రాజకీయ నాయకులకు సదరు వ్యక్తి నేరుగా ఫోన్ చేసి డబ్బులు పంపించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులతోనూ డబ్బులు కావాలని అడిగినట్టు తెలిసింది. ఇటీవల ఓ వ్యక్తితో రూ.ఐదు లక్షలు వసూలు చేసినట్టు మహబూబ్‌నగర్ పోలీసులు గుర్తించారు. దీనిపై వారు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కడి హస్తమే ఉందా.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. దీనిపై మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా సీవీ ఆనంద్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.