పోలీస్‌నంటూ వైద్యుడిని బెదిరించి రూ.75 లక్షలు కాజేయబోయిన కిలాడి దొంగ

Fraudster Arrested In Hyderabad Banjarahills - Sakshi

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లోని ఓ ప్రముక ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న ఓ వైద్యుడు బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం ఆ వైద్యుడి వ‌ద్ద మ‌హేశ్ అనే వ్య‌క్తి డ్రైవ‌ర్‌గా ప‌ని చేశాడు. ఆ స‌మ‌యంలోనే ఆ వైద్యుడికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒక‌టి అత‌ను సేక‌రించాడు. ఈ విష‌యం తెలిసుకున్న ఆ వైద్యుడు అత‌న్ని ప‌నిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి మ‌హేశ్ ఓ ప్రైవేటు సంస్థ‌లో హెచ్ఆర్‌గా ప‌ని చేస్తున్న గౌతం నాయ‌ర్ వ‌ద్ద డ్రైవ‌ర్‌గా చేరాడు. అయితే మ‌హేశ్ తన జల్సాల కోసం గౌతం నాయ‌ర్ వ‌ద్ద నుంచి మొత్తం రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పు చేశాడు.

అప్పు చెల్లించ లేని మ‌హేశ్ త‌ప్పుడు మార్గంలో అధిక మొత్తం సంపాదంచే ఓ ప్ర‌ణాళిక‌ను గౌతం నాయ‌ర్‌కు చెప్పాడు. గ‌తంలో తాను ఓ వైద్యుడి వద్ద పని చేశానని, వైద్యుడు త‌న భార్య‌ను చంపుతాన‌ని మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి త‌న వ‌ద్ద ఉంద‌ని దానిని ఆసరాగా చేసుకొని ఆ వైద్యుడిని బెదిరించి డ‌బ్బు సంపాదిద్దామ‌ని గౌతం నాయ‌ర్‌కు ప్లాన్‌ చెప్పాడు. 

మ‌హేశ్ మాటలు విని ఈ నెల 14న గౌతం నాయ‌ర్ వైద్యుడికి ఫోన్ చేసి తాను ఖ‌మ్మం సీఐన‌ని మీ ఆడియో క్లిప్ ఒకటి తన వ‌ద్ద ఉంద‌ని రూ.75 ల‌క్ష‌లు ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవాల‌ని బెదిరించాడు. దీంతో ఆ వైద్యుడు వెంటనే పోలీస్‌ల‌ను ఆశ్ర‌యించాడు. కేసు నమొదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్‌ ప్రకారం ఆ వైద్యుడితో గౌతం నాయ‌ర్‌కు రూ.75 ల‌క్ష‌లు కాదని రూ.20 ల‌క్ష‌లు చెల్లిస్తాన‌ని తన ఆడియో క్లిప్ తనకి ఇవ్వవలసిందిగా పోలీసులే దగ్గరుండి ఫోన్ చేయించారు. అలాగే డ‌బ్బులు తీసుకోడానికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రముక ఆల‌యం వ‌ద్ద‌కు రావాల్సిందిగా సూచించారు. అయితే గౌతం నాయ‌ర్ పోలీస్ స్టిక్క‌ర్ వేసిన కారులో ఆల‌యానికి వ‌చ్చాడు. అప్ప‌టికే పోలీసులు ఆ ఆల‌యం వ‌ద్ద కాపు కాశారు.

ఈ క్రమంలోనే ఆ వైద్యుడితో  గౌతం నాయ‌ర్ మాట్లాడుతుండ‌గానే అతన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్ర‌ధాన నిందితుడు మ‌హేశ్ అక్కడి నుంచి ప‌రారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అనంతరం పోలీసులు మాట్లాడుతూ ఇలా ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే భయపడకుండా ధైర్యంగా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top