కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం

Forest Range Officer Killed In Guthikoya Tribal Attack In Kothagudem - Sakshi

పదునైన ఆయుధాలతో దాడి 

గంటకు పైగా రక్తపు మడుగులోనే ఎఫ్‌ఆర్‌ఓ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్‌పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్‌ఆర్‌ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్‌ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్‌ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్‌ఆర్‌ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.  

జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్‌ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్‌ మీద ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. 

పచ్చదనమే ప్రాణంగా బతికారు 
పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్‌ మెడల్‌ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్‌లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎఫ్‌ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top