కాలేజ్‌కు వెళ్తుండగా.. తండ్రి కళ్లెదుటే ఘోరం

Father Loses Daughter In Road Accident At Visakhapatnam - Sakshi

బీఈడీలో చేరేందుకు తండ్రితో కలిసి బైక్‌పై కుమార్తె పయనం

బస్సు ఢీకొనగా వెనుక చక్రాల కింద పడి మృతి

తండ్రికి స్వల్ప గాయాలు

గోపాలపట్నం (విశాఖ పశ్చి): బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుమార్తెను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కళ్లెదుటే చోటుచేసుకున్న ఈ ఘోరాన్ని చూసి ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆదివారం ఎన్‌ఏడీ జంక్షన్‌  వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాక భవానీనగర్‌కు చెందిన సమ్మిడి గీతాకుమారి (21) బీఈడీలో చేరేందుకు తండ్రి వెంకటరావుతో ద్విచక్రవాహనంపై ఎంవీపీ కాలనీకి బయలుదేరింది.

ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దాటిన తరువాత వెనుకనుంచి వస్తున్న ప్రైవేటు బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పింది. వెనుక కూర్చున్న గీతా కుమారి కుడివైపుగా బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. ఆమె నడుమ మీదుగా బస్సు వెళ్లిపోవడమే కాకుండా కొంతదూరం ఈడ్చుకుపోయింది. కడుపు భాగమంతా తీవ్ర గాయాలయ్యాయి.

ట్రాఫిక్‌ పోలీసులు ప్రైవేటు వాహనంలో కేర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కేజీహెచ్‌ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపు భాగంలో అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. వెంకటరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. 

గుండెలవిసేలా రోదన
గీతా కుమారికి అన్న, తమ్ముడు ఉన్నారు. ఇంటికి ఒక్క ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెరిగింది. మా ఇంటి మహాలక్ష్మి కోల్పోయామని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బీఈడీ కోర్సులో చేరేందుకు థంబ్‌ వేసేందుకు ఎంవీపీ కాలనీకి వెళ్తుండగా  యువతి ప్రమాదానికి గురైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top