కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

Father kills son   - Sakshi

మన్సూరాబాద్‌/హయత్‌నగర్‌: మద్యం తాగి కుటుంబ పరువు తీస్తున్నాడని కలత చెందాడో..ఆస్తి తగాదాలు ఉన్నాయో తెలియలేదు కానీ..ఓ తండ్రి కన్న కొడుకును కడతేర్చాడు. ఈ సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కలగోని శ్రీనివాస్‌గౌడ్‌ గత కొంత కాలంగా మునగనూరులోని రామాంజనేయకాలనీ రోడ్‌నెంబర్‌–7 స్వంత ఇంటిలో నివాసం ఉంటూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

కుమారుడు వినయ్‌ (28) ఐదు సంవత్సరాల క్రితం ప్రవల్లికను ప్రేమించి పెళ్లి చేసుకుని సమీపంలోని ఓ ఇంట్లో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి రెండేళ్ల పాప రక్షిత ఉంది. ఇటీవల కొద్ది కాలంగా వినయ్‌ తరచుగా మద్యం తాగి తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌ నివాసానికి వచ్చి వ్యాపారం చేసుకుంటా డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. వ్యాపారం చేసుకుంటా..ఆస్తిలో తన భాగం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.

 అలాగే మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. చేసేది లేక శ్రీనివాస్‌గౌడ్‌ రూ.500 మద్యానికి ఇచ్చాడు. అనంతరం వినయ్‌ మద్యం తెచ్చుకుని తాగి మరింతగా ఇంట్లో గొడవకు దిగాడు.  దీంతో ఆవేశానికి లోనైన  శ్రీనివాస్‌గౌడ్‌ అక్కడే ఉన్న ఇనుప పారతో వినయ్‌ తలపై గట్టిగా బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై వినయ్‌ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని కూడా తెలుస్తోంది. హయత్‌నగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top