రాచకొండలో నకిలీ డాక్టర్‌ హల్‌చల్‌

Fake Doctor Teja Reddy Hulchul In Rachakonda Commissionarate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నకిలీ డాక్టర్‌ హల్‌చల్‌ చేశాడు. తేజారెడ్డి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్స్‌ సృష్టించి ఏకంగా పోలీసులకే మస్కా కొట్టి లాక్‌డౌన్‌ సమయంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో రాచకొండ పరిధిలోని పలువురు పోలీసులకు కరోనా మందులు కూడా అందించినట్లు తెలిసింది. అయితే తేజారెడ్డి వ్యవహారంపై పోలీసులకు అనుమానం రావడంతో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

గతంలో బెంగుళూరులోనూ ఇదే తరహాలో అక్కడి పోలీసులను బురిడీ కొట్టించాడు. తాను ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ నంటూ.. సీనియర్‌ ఐపీఎస్‌ కుమారుడినంటూ చెప్పుకుంటూ పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ అందించేవాడు. ఈ కేసులో తేజారెడ్డిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తేజారెడ్డి హైదరాబాద్‌కు తన మకాం మార్చాడు. (చదవండి : మూగ ప్రేమజంట బలవన్మరణం)

లాక్‌డౌన్‌ సమయంలో తేజారెడ్డి డాక్టర్‌ అవతారమెత్తి రాచకొండ పరిధిలోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వలంటీర్‌గా విధులు నిర్వహించాడు. అంతేగాక తేజారెడ్డి పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 15 లక్షలకు పైగా రుణాలు తేజారెడ్డి ఎగ్గొట్టినట్లు తేలింది. మరోవైపు తేజారెడ్డి తన వ్యక్తిగత జీవితంలో.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. తేజారెడ్డి తనపై వేధింపులకు గురి చేస్తున్నట్లు అతని రెండవ భార్య ఈ మధ్యనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తేజారెడ్డి ఇటీవలే ఒక రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనంగా స్టికర్‌ అంటించి తిరుగుతున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా తేజారెడ్డి జీవిత చరిత్ర బయటపడింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top