ఇల్లు ఖాళీ చేయమన్నందుకు... అసభ్యంగా ప్రవర్తించాడంటూ..

Fake Alligation Atrocity Case On Family In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం.. కాశిబుగ్గ తిలక్‌రోడ్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళ ఏడు నెలల క్రితం తమ ఇంట్లో అద్దెకు తీసుకుందని, సదరు మహిళకు తమకు బేదాభిప్రాయాలు రావడంతో ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఖాళీ చేయక తమను దూషిందని, దీంతో పాటు సదరు మహిళ స్థానిక నేతల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది.

ఈ విషయంపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు మహిళ ఆరోపించిన విషయంలో వాస్తవం లేదని గుర్తించి సదరు మహిళను మందలించి వదిలేశారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు సీఐ బదిలీపై వెళ్లడంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది.‘ఓసిటీ మైదానంలో పంచాయితీ నిర్వహిస్తున్నాం.. హాజరు కావాలి’ అంటూ సమాచారం పంపడంతో ఖంగుతి న్న బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. మా మాటలు లెక్కచేయకుండా పీఎస్‌కు పోతావా? అంటూ ఏకంగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే దాడికి దిగినట్లు తెలిసింది. సదరు మహిళకు మద్దతుగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎస్సై ఆధ్వర్యంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సీఐని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మళ్లీ కేసు విషయంలో మంతనాలు జరిపినట్లు సమాచారం.

గత సీఐ జరిపిన విచారణను పరిగణలోకి తీసుకోకుండానే కుటుంబంలోని ఆరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ను వివరణ కోరగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం ఏసీపీ విచారణలో ఉన్నట్లు తెలిసింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top