పట్టెడన్నం పెట్టేవారు లేక.. వృద్ధ దంపతుల ఆకలిచావు? 

Elderly Couple Dies Of Starvation In Mancherial - Sakshi

చిన్న కొడుకు మరణం, అందుబాటులో లేని పెద్ద కొడుకు 

కుటుంబ కలహాలకు పండుటాకులు బలి

సాక్షి, మంచిర్యాల: అందరూ ఉన్నా.. మలి సంధ్యలో తినడానికి తిండి లేక పది రోజులపాటు ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ∙సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం లో శనివారం జరిగింది. ఎస్సై చంద్రశేఖర్‌ కథనం ప్రకారం..  మండల పరిధిలోని పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బియ్యాల రాజయ్య (70), మల్లక్క(63) దంపతులకు ఇద్దరు కుమారులు మల్లేశ్, రవి ఉన్నారు. ఇద్దరికీ వివాహం అయింది. ఆస్తి పంపకాలు కూడా జరిగాయి. రాజయ్యకు ఆరేళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితయ్యాడు. భార్య మల్లక్క కూడా నెల క్రితం మంచాన పడింది. తల్లిదండ్రులను చూసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దమనుషులు పంచాయితీలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌ కూడా వెళ్లారు. ఈ క్రమంలో గొడవల కారణంగా ఏప్రిల్‌ 30న చిన్న కుమారుడు రవి ఆత్మహత్య చేసుకున్నాడు.  

కొడుకు ఆత్మహత్యతో పెరిగిన గొడవలు  
రవి ఆత్మహత్య తర్వాత కుటుంబంలో గొడవలు మరింత పెరిగాయి. రవి భార్య స్వప్న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై దత్తాత్రితోపాటు సర్పంచ్‌ రాజేశం, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తరువాత ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా పెద్ద కొడుకు మల్లేశ్‌ గ్రామం నుంచి వెళ్లిపోయి రంగపేటలో ఉంటున్నాడు. దీంతో వృద్ధుల బాగోగులు చూసుకునేవారు కరువయ్యా రు. కొద్దిరోజుల క్రితం మల్లేశ్‌ వచ్చి తల్లిదండ్రులకు స్నానం చేయించి ఆహారం పెట్టాలని ఇంటిపక్కన సమీప బంధువుకు చెప్పి వెళ్లాడు. అయితే, ఆ బంధువుకు జ్వరం రావడంతో ఆయన వృద్ధుల వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలో  ఆకలికి అలమటించి శుక్రవారం రాత్రి మృతిచెందారు.  ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్సై రాజేందర్‌ పరిశీలించారు.  

 
బాధ్యులపై చర్య తీసుకోవాలి.. 

తన తల్లిదండ్రులను కొంతమంది వ్యక్తులు చంపినట్లు అనుమానం ఉందని, మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దకొడుకు మల్లేశ్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top