నష్టాలు చూపించి.. కోట్లు కొల్లగొట్టి..

ED Arrests Karvy Group CMD Parthasarathy And Investigating - Sakshi

రూ.2 వేల కోట్లకు పైగా సొమ్ము ఎక్కడికి వెళ్లింది?..

కార్వీ ఎండీ, సీఎఫ్‌ఓలను విచారిస్తున్న ఈడీ

నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నల వర్షం

సాక్షి, హైదరాబాద్‌: కస్టమర్ల పేరిట ఉన్న షేర్లను తనఖా పెట్టి మూడు వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి వ్యవహారంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. నాలుగు రోజుల క్రితం అరెస్ట్‌చేసిన పార్థసారథితోపాటు కంపెనీ సీఎఫ్‌ఓ కృష్ణ హరిని విచారిస్తోంది. గురువారం కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్న ఈడీ మొదటి రోజు.. షేర్ల పేరిట రుణాలు తీసుకున్న డబ్బును ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

షెల్‌ కంపెనీలపై వేల కోట్ల రుణం
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ షేర్లు కొనుగోలు చేసిన క్లయింట్‌ షేర్లను పవర్‌ ఆఫ్‌ అటార్నీతో బదలాయించుకున్న పార్థసార«థి.. కృష్ణ హరితో కలిసి కార్వీ రియల్టీతోపాటు 14 షెల్‌ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ విచారణలో బయటపడింది. కస్టమర్ల షేర్లను సైతం షెల్‌ కంపెనీలకు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా మళ్లించిన షేర్లను 5 షెల్‌ కంపెనీల పేరిట తనఖా పెట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.400 కోట్ల రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది.

ఈ డబ్బును కార్వీ సంస్థల అప్పుల చెల్లింపునకు ఉపయోగించినట్టు పార్థసారథి, కృష్ణ హరి విచారణలో చెప్పిననట్టు దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. కార్వీ రియల్టీతోపాటు మరో 9 కంపెనీల పేరు మీదకు మళ్లించిన షేర్లతో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా రుణాలు పొందేందుకు యత్నించారని, ఆ తర్వాత రెండు ప్రైవేట్‌ బ్యాంకుల ద్వారా రూ.రెండువేల కోట్లకు పైగా రుణం పొందినట్టు గుర్తించారు.

ఆ డబ్బు సంగతేంటి?
స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ నుంచి మళ్లించిన షేర్లను తన వ్యక్తిగత ఖాతాతోపాటు కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలకు తరలించినట్టు గుర్తించిన ఈడీ.. అక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారన్న అంశాలపై  లోతుగా విచారిస్తోంది. కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలోకి దాదాపు రూ.2వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించింది. తర్వాత ఈ డబ్బును ఎక్కడికి మళ్లించారు, షేర్ల బదలాయింపునకు ముందే కంపెనీని భారీ నష్టాల్లో ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న దానిపై పార్థసారథిని ప్రశ్నిస్తోంది. ఇద్దరూ కంపెనీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కుంభకోణంలో పాలుపంచుకునేలా చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై కస్టడీలో పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top