లెహెంగాల ఫాల్స్‌లో డ్రగ్స్‌

Drugs Hidden In Lehengas Worth Crores NCB Seized In Bengaluru - Sakshi

హైదరాబాద్‌ టు ఆస్ట్రేలియా వయా బెంగళూరు 

నర్సాపురం నుంచి బుక్‌ చేసినట్లు తప్పుడు చిరునామా 

బెంగళూరులో పట్టివేత.. చెన్నైలో ప్రధాన నిందితుడి అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ను తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పెడ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కొరియర్‌ ద్వారా ఆస్ట్రేలియాకు రవాణా చేసేందుకు లెహెంగాల్లోని ఫాల్స్‌లో కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ పెట్టి కుట్టేశారు. ఈ లెహెంగాలను కార్గోలో పంపేందుకు యత్నించి బెంగళూరు నార్కోటిక్‌ డ్రగ్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులకు చిక్కింది ఓ ముఠా. మూడు లెహెంగాల్లోని ఫాల్స్‌లో 3 కేజీల మిథిలీన్‌ డైఆక్సీ మిథాంఫిటమిన్‌ (ఎండీఎంఏ) డ్రగ్‌ పెట్టి చెన్నైకి చెందిన పెడ్లర్‌ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కొరియర్‌ ఏజెన్సీ ద్వారా కన్‌సైన్‌మెంట్‌ బుక్‌ చేశాడు.

ఎన్‌సీబీకి సమాచారం అందడంతో ఆ పార్శిల్‌ను ట్రాక్‌ చేశారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో గురువారం స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్‌ను తెరిచి చూడగా మూడు లెహెంగాల్లో్ల ఎండీఎంఏ డ్రగ్స్‌ దొరికాయి. ఏపీలోని నర్సాపురంలో ఓ తప్పుడు చిరునామా ఉపయోగించి చెన్నైకి చెందిన ఓ పెడ్లర్‌ దీన్ని బుక్‌ చేసినట్లు గుర్తించారు. అనంతరం చెన్నైలోని నిందితుడి అసలు అడ్రస్‌ గుర్తించి, ఎన్‌సీబీ అధికారులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్శిల్‌ను పంపేందుకు ఈ పెడ్లర్‌ నకిలీ డాక్యుమెంట్లు వినియోగించినట్లు విచారణలో తేలినట్లు అధికారులు చెప్పారు.  

మరో కేసులో నలుగురు అరెస్టు 
మరో కేసులో భాగంగా బెంగళూర్‌ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందాను ఎన్‌సీబీ చేధించింది. శనివారం బెంగళూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్విఫ్ట్‌ కారును ఎన్‌సీబీ దేవనహల్లి చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేయగా, హై గ్రేడ్‌ గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్, మిథాంఫిటమిన్, మెథక్వలోన్‌ లభ్యమైనట్లు ఎన్‌సీబీ బెంగళూర్‌ జోనల్‌ డైరెక్టర్‌ అమిత్‌ గౌవాటే తెలిపారు.

కారులో ఉన్న నలుగురి అరెస్టు చేసి విచారించగా, వారిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌లో నివసిస్తున్న బిహార్‌కు చెందిన వారని గుర్తించినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌ను వీకెండ్‌ పార్టీలకు సరఫరా చేసేందుకు వెళ్తున్నారని, హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లోకి ఈ డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా బెంగళూరులో కొంత గంజాయితో పాటు ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్‌ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. 

హాట్‌ స్పాట్లుగా.. 
విదేశాలకు డ్రగ్స్‌ రవాణా చేయడంలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూర్‌ నగరాలు హాట్‌ స్పాట్లుగా మారుతున్నట్లు ఎన్‌సీబీ పేర్కొంటోంది. ఎవరెవరో వ్యక్తులు హైదరాబాద్, ముంబై ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేయడం ఆందోళన కల్గిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో విదేశాలకు చెందిన మాఫియా లోకల్‌ గ్యాంగ్‌లతో పెట్టుబడి పెట్టిస్తోందని, ఆ డ్రగ్స్‌ను ఇలా కొరియర్ల రూపంలో మళ్లీ అక్కడికే తెప్పించుకుంటోందని తేలింది. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న పెడ్లర్లపై దృష్టి పెడితే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top