పాఠశాల సమీపంలో ఘర్షణ.. ఏడో తరగతి విద్యార్థి మృతి

Dispute Between Students Near School At Visakhapatnam - Sakshi

పాఠశాల సమీపంలో విద్యార్థుల మధ్య వివాదం 

సంఘటన స్థలంలో కుప్పకూలిన విద్యార్థి  

సీసీ ఫుటేజీలో పోలీసులు వివరాల సేకరణ

సాక్షి, సీతమ్మధార (విశాఖ ఉత్తర): పాఠశాల సమీపంలో విద్యార్థుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం అక్కయ్యపాలెం దరి లలితానగర్‌ జ్ఞాననికేతన్‌ స్కూల్‌ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇన్‌చార్జి డీసీపీ ఆదినారాయణ, ఈస్ట్‌ ఏసీపీ హర్షితచంద్ర విలేకరు లకు వెల్లడించారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో ఘర్షణ జరిగింది. స్కూల్‌ విడిచిపెట్టిన తరువాత నలుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి వెళ్లారు. అందులో ఒక్క విద్యార్థి స్టార్ట్‌ అని చెప్పగా ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో జశ్వంత్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

తోటి విద్యార్థులు స్కూల్‌ యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి టీచర్స్‌ చేరుకుని జశ్వంత్‌ని హాస్పటల్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమీపంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో విద్యార్థులు కొట్టుకున్నట్లు గుర్తించారు. ప్రిన్సిపాల్, విద్యార్థులను, స్థానికులను విచారించారు. విద్యార్థుల మధ్య కొట్లాట కారణంగానే తమ కుమారుడు మృతి చెందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్త్‌ టౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 

►కైలాసపురంలో నివసిస్తున్న రామలక్ష్మి, రాములకు ఇద్దరు సంతానం. పెద్దవాడు జశ్వంత్‌(13) జ్ఞాననికేతన్‌ స్కూల్‌లో గతేడాది చేరాడు. కొద్ది రోజులుగా తోటి విద్యార్థులు కొడుతున్నట్లు తల్లిదండ్రులకు జశ్వంత్‌ చెప్పినట్లు తెలిసింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top