ఆగని టీడీపీ ఉన్మాదం | Destruction of government property continues across the state | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ ఉన్మాదం

Published Fri, Jun 14 2024 4:57 AM | Last Updated on Fri, Jun 14 2024 7:55 AM

Destruction of government property continues across the state

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం

కనీస చర్యలు తీసుకోని ప్రభుత్వం

రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు

సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడుల రూపంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మొదలైన ఈ దాడుల నియంత్రణకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. దీన్ని ఆసరా చేసుకొని టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయి. గురువారమూ టీడీపీ శ్రేణులు పలు సచివాలయాలు, ప్రభుత్వ స్థలాలపై దాడులు చేశాయి. శిలాఫలకాలు ధ్వంసం చేశాయి. బోర్డులు విరగ్గొట్టాయి.

» చిత్తూరు జిల్లా  పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లె సచివాలయాలకు, వెల్‌నెస్‌ సెంటర్లకు, ఆర్‌బీకెలకు, ఆర్‌వో ప్లాంటుకు, నాడు–నేడు స్కూల్‌ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్న శిలాఫలాకాలను గునపాలతో ధ్వంసం చేశారు. దీంతో సచివాలయ కార్యదర్శులు భయంతో పరుగులు తీశారు.

»  బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో సచివాలయంలోని శిలాఫలకాలు, సంక్షేమ పథకాల బోర్డులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. శిలాఫలకాలు తొలగించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని ఎంపీడీవో రాజేష్‌ చెప్పారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతూ శిలాఫలకాలను  ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.» నగరి మండలం తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల ఫలకాన్ని గురువారం టీటీడీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్‌ పూశారు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.

»  శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం గ్రా­మ సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాల బోర్డు­ను టీడీపీ కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. 

»  నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో టీడీపీ నాయకులు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు పెసల ఏసోబు, యాడికి ఏబులపై కర్రలతో దాడి చేశారు.

»  బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వలాపల్లి గ్రామంలో 2017–2018లో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 2019లో దానిపై మొదటి అంతస్తు నిర్మించి, సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలే తప్ప శిలాఫలకాలు ధ్వంసం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్‌ మందా మోహన్‌రావు అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement