ఫేక్‌ మెయిల్‌తో రూ.46లక్షల లూటీ

Cyber Criminals Deceive Medical Agencies With Fake Mail - Sakshi

హైదరాబాద్‌: నగరానికి చెందిన మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీ వాళ్లకు సైబర్‌ నేరగాళ్లు భారీ వల వేశారు. సైబర్‌ నేరగాళ్లు పంపిన మెయిల్‌ను చూసిన ఇక్కడి మెడికల్‌ ఏజెన్సీ వాళ్లు ఏ మాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు అప్పగించేశారు. అసలైన కంపెనీ వాళ్లు మీ డబ్బు రాలేదనే వరకు తాము మోసపోయామని తేరుకుని సిటీ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

సంతోష్‌నగర్‌లోని ‘సెన్స్‌కోర్‌ మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ మెడికల్‌ ఏజెన్సీ(షాప్‌) వాళ్లు కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఏడాదిలో మూడు పర్యాయాలు ‘ఏజీ సైంటిఫిక్‌’ నుంచి మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఇక్కడి వాళ్లు కొనగోలు చేస్తుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్‌’వారిని సంప్రదించారు. అదేవిధంగా “ఏజీ సైంటిఫిక్‌’ వాళ్లు బ్యాంక్‌ ఖాతా ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారు. దీనిని గమనించిన సైబర్‌ నేరగాళ్లు పరకాయ ప్రవేశం చేశారు. ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్‌ తీసేసి ఫేక్‌ మెయిల్‌ సృష్టించారు.  

ఫేక్‌ మెయిల్‌తో రూ.46లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్‌ అకౌంట్‌ను కూడా పొందుపరిచారు. బ్యాంక్‌ అకౌంట్లను వాళ్లు మారుస్తుంటారు కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లు అడిగిన రూ.46లక్షలకు ఆయా అకౌంట్లకు పంపారు. ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌ మాసంలో జరిగింది. తాజాగా రెండు రోజుల క్రితం కాలిఫోర్నియో  కంపెనీ ‘ఏజీ సైంటిఫిక్‌’ వాళ్లు మీ డబ్బులు రాలేదు, డబ్బు పంపితే ఇన్‌స్ట్రుమెంట్స్‌ పంపిస్తామన్నారు. తాము సెప్టెంబర్‌లోనే పంపామని అకౌంట్‌ నంబర్‌ను, మెయిల్‌ ఐడీలను వాళ్లకు చెప్పగా..ఇవేవీ తమవి కాదని తేల్చారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఇక్కడి ఏజెన్సీ యజమాని వరప్రసాద్‌ సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top