పక్కా ప్లాన్‌.. ఒక్క రోజే రూ.30 లక్షలు హాంఫట్‌

Cyber Crimes Raises Rapidly In Hyderabad - Sakshi

సాక్షి,హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌): సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా తమదైన పద్ధతిలో గుల్ల చేస్తున్నారు. సైబర్‌ కేటుగాళ్లు విసిరే వలకు అమాయకులు మోసపోతూనే ఉన్నారు. ఇలా శనివారం ఒక్కరోజే నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.30 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. సిటీ సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.7 లక్షలు..  
ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి భారీ మొత్తంలో నగదు కట్‌ అయినట్లు మహబూబ్‌గంజ్‌ బ్రాంచ్‌కు చెందిన మేనేజర్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం మిషన్ల నుంచి వేరే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వారు వేర్వేరు ఏటీఎంలలో రూ.7 లక్షల 30 వేల 400 నగదు డ్రా చేశారు. డ్రా చేసిన వ్యక్తులకు మిషన్‌ నుంచి డబ్బులు రాలేదంటూ తమ బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలను చెక్‌ చేయగా.. ఆయా ప్రాంతాల్లో నగదు విత్‌డ్రా అయినట్లు తమకు సిస్టంలో చూపిస్తోందనారు. ఇలా రూ.7లక్షల 30వేల 400 ఎలా పోయాయో, ఎవరు తీశారో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.  

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో..  
ఎస్‌బీఐ కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే అకౌంట్‌ రద్దు అవుతుందని నమ్మించి మోసం చేశారంటూ శ్రీనగర్‌కాలనీకి చెందిన చంద్రవర్మ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ పంపిన వ్యక్తి కాల్‌ చేసి మెసేజ్‌ ఓపెన్‌ చేయమన్నట్లు పేర్కొన్నారు. అది ఓపెన్‌ చేశాక ఓటీపీ చెప్పడంతో ఆ వెంటనే అకౌంటులోంచి రూ.6 లక్షల 41వేల 59 స్వాహా చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ..  
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ తనని మోసం చేశారంటూ ప్రేమ్‌నగర్‌కు చెందిన కల్యాణి ఫిర్యాదు చేశారు. కునాల్‌ అనే వ్యక్తి కాల్‌ చేసి ఇండిగోలో ఉద్యోగముందని ఇంటర్వూ్యకు ప్రిపేర్‌ కావాలన్నాడు. ముందుగా రూ.2100 చెల్లించి ఇంటర్వూ్యకు రాగా.. అకౌంట్‌లో కనీసం రూ.25 వేలు మెయింటెన్‌ చేయాలన్నాడు. ఇలా ఆధార్, పాన్‌ తదితర డాక్యుమెంట్లు అడిగి తన నుంచి పలు దఫాలుగా రూ.2 లక్షల 36 వేల 112 కాజేసినట్లు ఫిర్యాదు చేశారామె.   

పార్ట్‌ టైం జాబ్‌ పేరిట.. 
అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్‌ ఉందని ఓ వ్యక్తి కాల్‌ చేసి మోసం చేశాడని ఎస్సార్‌నగర్‌కు చెందిన విమల్‌కుమార్‌ గుప్తా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం కోసమంటూ రూ.1.8 లక్షలు సైబర్‌ కేటుగాళ్లు తమ అకౌంట్‌లలో వేయించుకున్నట్లు తెలిపారు. ఓఎల్‌ఎక్స్‌లో తాను పెట్టిన సోఫా నచ్చి ఓ వ్యక్తి ఫోన్‌ కొంటానంటూ నమ్మించాడు. క్యూఆర్‌ కోడ్‌ పంపి రూ.1.49 లక్షలు దోచుకున్నట్లు నల్లకుంటకు చెందిన ఆశీష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.1.91 లక్షలు పెట్టుబడి పెట్టించి తనని మోసం చేశారంటూ తిలక్‌నగర్‌కు చెందిన రమేష్‌ పోలీసుల్ని ఆశ్రయించారు.   

ఆపిల్‌ ఫోన్‌ గెలుచుకున్నావంటూ..  
యూసఫ్‌గూడకు చెందిన సుప్రదకు ఓ వ్యక్తి కాల్‌ చేసి మీరు ఆపిల్‌–13 ఫోన్‌ను గిఫ్ట్‌గా గెలుచుకున్నారంటూ చెప్పాడు. మీకు ఓ లింక్‌ పంపామని, దానిని ఫిల్‌ చేసి క్లెయిమ్‌ చేస్తే మీకు ఫోన్‌ పంపిస్తామన్నారు. ఫిల్‌ చేశాక ఓటీపీ వస్తుందని.. అది చెప్పమనడంతో సుప్రద చెప్పింది. అంతే క్షణాల వ్యవధిలో అకౌంట్‌లో నుంచి రూ.5 లక్షల 54 వేల 986 కట్‌ అయ్యాయి.   

రాంచీలో ఇల్లు అద్దెకు కావాలంటూ.. 
వెస్ట్‌మారేడ్‌పల్లిలో నివసించే రాకేష్‌కుమార్‌ సింగ్‌ ఎస్‌బీఐ బ్యాంకులో చీఫ్‌ మేనేజర్‌గా రిటైరయ్యారు. ఆయనకు ఝార్ఖండ్‌లోని రాంచిలో సొంత ఇల్లు ఉంది. నగరంలోనే నివాసం ఉంటున్న కారణంగా ఆ ఇల్లు ఖాళీగా ఉంటోంది. దీంతో ఇంటిని అద్దెకు ఇస్తామంటూ ‘మ్యాజిక్‌ బ్రిక్స్‌’లో యాడ్‌ ఇచ్చారు. యాడ్‌ను చూసిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఇల్లు బాగుంది తీసుకుంటానని నమ్మించాడు. ఇందుకోసం అడ్వాన్స్‌ చెల్లిస్తామని క్యూఆర్‌ కోడ్‌లు పంపారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంతో తొలుత రూ.లక్ష వరకు కట్‌ అయ్యాయి. ఇలా ఎందుకయ్యిందని రాకేష్‌కుమార్‌ ప్రశ్నించంగా.. పొరపాటయ్యిందని మరో కోడ్‌ పంపించారు. ఇలా పది కోడ్‌లు పంపి సుమారు పది అకౌంట్ల నుంచి రూ.10.8 లక్షలు స్వాహా చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. 

చదవండి: హత్య కేసులో అరెస్ట్‌.. విచారణలో షాకింగ్‌ నిజాలు.. పోలీసులకే చెమటలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top