ఫోన్‌ ఒకరిది... ‘అమ్మింది’ మరొకరు!

Cyber Crime Hyderabad: Man Dupes Buyer on OLX - Sakshi

తన ఫోన్‌ ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన నగర వాసి

దీన్ని ‘కాపీ’ చేసి ‘పోస్ట్‌’ చేసిన తిరుపతికి చెందిన వ్యక్తి

విషయం తెలియక మోసపోయిన గచ్చిబౌలి యువకుడు

సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితుడు

సాక్షి, హైదరాబాద్‌: ఓఎల్‌ఎక్స్‌లో విక్రయానికి పెట్టిన వస్తువులు కొంటామని, మరికొన్నింటిని అమ్ముతామంటూ పోస్టింగ్స్‌ పెట్టి అందినకాడికి దండుకునే కేసుల్ని తరచు చూస్తునే ఉంటున్నాం. అయితే ఈ యాప్‌ కేంద్రంగా జరిగిన ఓ వెరైటీ సైబర్‌ క్రైమ్‌ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందులో బాధితుడు, ‘బాధితుడి లాంటి వ్యక్తి’ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. (అల్లుడితో సంబంధం.. వేధింపులు భరించలేక)

అసలేం జరిగింది?

 • నగరంలో పశ్చిమ మండల పరిధిలో ఉన్న ఎస్సార్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పవన్‌ అనే యువకుడు తన వద్ద ఉన్న ఫోన్‌ను విక్రయంచాలని భావించాడు.
 • దీనికోసం అతడు దాని ఫొటో, వివరాలతో పాటు తన ఫోన్‌ నెంబర్‌ను పొందుపరుస్తూ ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో ఒక యాడ్‌ పోస్టు చేశాడు. అందులో ఆ ఫోన్‌ రేటును రూ.27 వేలుగా పేర్కొన్నాడు.
 • తిరుపతి సమీపంలోని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న బాలాజీ అనే నిందితుడు ఈ యాడ్‌ని చూశాడు. అందులోని ఫోన్‌ ఫొటో, వివరాలు కాపీ చేసి మరో యాడ్‌గా పోస్ట్‌ చేశాడు.
 • ఈ యాడ్‌ను గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మోహన్‌ అనే వ్యక్తి చూశాడు. ఆ ఫోన్‌ ఖరీదు చేయాలని భావించిన అతగాడు ‘కాపీ–పోస్ట్‌’ యాడ్‌లో ఉన్న నెంబర్‌ ఆధారంగా బాలాజీని సంప్రదించాడు.
 • బేరసారాల తర్వాత ఆ ఫోన్‌ను రూ.20 వేలకు ‘విక్రయించడానికి’ బాలాజీ అంగీకరించాడు. అయితే తాను ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉన్నానని, ఎస్సార్‌నగర్‌ వెళితే తన సోదరుడు ఫోన్‌ చూపిస్తాడంటూ చెప్పి పవన్‌ నెంబర్‌ ఇచ్చాడు.
 • ఆ వెంటనే పవన్‌కు ఫోన్‌ చేసిన బాలాజీ... ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన ఫోన్‌ తనకు నచ్చిందని, అయితే తాను వేరే ఊరిలో ఉండటంతో తన స్నేహితుడు వచ్చి దాన్ని పరిశీలించి వెళతాడని చెప్పాడు.
 • అతడికి ఫోన్‌ చూపించాలని, నచ్చితే వెంటనే తనకు ఫోన్‌ చేసి చెప్తాడని పవన్‌తో నమ్మబలికాడు. ఈ విషయం నమ్మిన పవన్‌ వచ్చిన వ్యక్తిని కలిసి ఫోన్‌ చూపించాలని నిర్ణయించుకున్నాడు.
 • బాలాజీ చెప్పిన ప్రకారం పవన్‌ను అతడి సోదరుడిగా భావించిన మోహన్‌ ఎస్సార్‌గనర్‌ వచ్చి ఫోన్‌ చేశాడు. తనకు ఫోన్‌ చేసింది బాలాజీ ఫ్రెండ్‌గా భావించిన అతడు వెళ్ళి కలిసి ఫోన్‌ చూపించాడు.
 • వీరిద్దరూ కలిసి ఉండగానే మోహన్‌కు కాల్‌ చేసిన బాలాజీ... ఫోన్‌ నచ్చిందా? అంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో ఆ ఫోన్‌ను పవన్‌ నుంచి తీసుకుని పరిశీలిస్తున్న అతడు ఔనంటూ సమాధానం ఇచ్చాడు.
 • ఫోన్‌లోనే బేరసారాలా తర్వాత రూ.20 వేలకు విక్రయించడానికి అంగీకరించాడు. ఆ వెంటనే తన పథకాన్ని అమలులో పెట్టిన బాలాజీ తొలుత రూ.12 వేలు తనకు ఫోన్‌పే చేయాలని, మిగిలిన మొత్తం పంపడానికి మరో ఖాతా చెప్తానన్నాడు.
 • పవన్‌ ఎదురుగానే ఉన్న మోహన్‌ తన ఫోన్‌ నుంచి బాలాజీకి ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేసేశాడు. ఆ తర్వాత ఫోన్‌ తీసుకుని వెళ్తుండగా అడ్డుకున్న పవన్‌ డబ్బు చెల్లించకుండా ఎలా తీసుకువెళ్తున్నారని ప్రశ్నించాడు.
 • దీంతో ఖంగుతిన్న మోహన్‌ ఇప్పుడే మీ అన్నయ్య బాలాజీకి బదిలీ చేశానని చెప్పగా... అతడు మీ స్నేహితుడు కదా? అంటూ పవన్‌ ప్రశ్నించాడు. ఇలా ఇద్దరూ చర్చించుకున్న నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 • తామిద్దరం బాలాజీ చేతిలో మోసపోయామని భావించారు. బాలాజీకి ఫోన్‌ చేసిన మోహన్‌ దీనిపై ప్రశ్నించగా... పరిస్థితి బాగోలేక, డబ్బు అవసరం ఉండి అలా చేశానని, రెండు రోజుల్లో తిరిగి ట్రాన్స్‌ఫర్‌ చేస్తానంటూ నమ్మబలికాడు.
 • ఇలా నాలుగు రోజుల పాటు వేచి చూసిన మోహన్‌ మంగళవారం పవన్‌ను తీసుకుని సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు వచ్చిన ఫిర్యాదు ఇచ్చాడు. దీని ఆధారంగా ఆరా తీస్తున్న అధికారులు బాలాజీగా చెప్పుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతా తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.
 • అతడు అక్కడే ఉండి ఈ నేరం చేశాడా? లేక నగరంలో ఉండి డబ్బు కాజేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిర్ధారించడానికి సాంతికేతిక ఆధారాలు సేకరిస్తున్నాడు.  
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top