
నిందితులతో కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి తదితరులు
కడప అర్బన్: ఏటీఏంలలో ఉన్న బ్యాటరీలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏటీఎం బ్యాటరీలే లక్ష్యంగా చేసుకుని వీరు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. అరెస్టయినవారిలో కడప నగరం నబీకోటకు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ ఖాలిద్, చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ అస్లాం బాష, కడప నగరం అక్కాయపల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ అబ్బాస్ ఉన్నట్లు తెలిపారు.
వీరి వద్ద నుంచి రూ.2 లక్షల 40 వేలు విలువైన 49 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు తెపారు. విచారణలో వీరిపై గతంలో కడప వన్‌టౌన్ పీఎస్ పరిధిలో రెండు కేసులు, కడప తాలూకా , టూటౌన్ పరిధిలో ఒక్కో కేసు నమోదై ఉన్నాయన్నారు.షేక్ ఖాలిద్, షేక్ అస్లాంబాష 2016లో 14 దొంగతనం కేసుల్లో ఉన్నారన్నారు. ఈ కేసుల్లో ఇద్దరు అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు.
దొంగలను అరెస్ట్ చేసి బ్యాటరీలను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన కడప వన్‌టౌన్ సీఐ టి.వి.సత్యనారాయణ, ఎస్‌ఐలు నారాయణ, సిద్దయ్య, సుధాకర్, ఏఎస్‌ఐ మల్లయ్య, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుళ్లు బాష, ప్రసాద్, ఖాదర్, నారాయణరెడ్డి, మహేష్, సుందర్, రాజశేఖర్‌లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.