చిన్నారి కిడ్నాప్‌: సిటీ పోలీసులు‌ మీకు సలాం‌

CP Anjani Kumar Reveals Three Years Rudramani Kidnap Case - Sakshi

10 రోజులు.. 800 కిలోమీటర్లు!

అబిడ్స్‌లో కిడ్నాపైన మూడేళ్ల చిన్నారి కోసం వేట 

రెండు రాష్ట్రాల్లో గాలించిన హైదరాబాద్‌ పోలీసులు 

1800 సీసీ కెమెరాల్లో ఫీడ్‌ అధ్యయనం చేసిన వైనం

ఎట్టకేలకు మాలేగావ్‌ సమీపంలో బాబు రెస్క్యూ

సాక్షి, హైదరాబాద్‌:  కర్ణాటక నుంచి వచ్చి నగరంలో ఫుట్‌పాత్‌పై జీవించే దంపతుల మూడేళ్ల చిన్నారి రుద్రమణిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. ఈ బాలుడి కోసం ఈ నెల 9న రంగంలోకి దిగిన అబిడ్స్‌ పోలీసులు పది రోజుల పాటు నిర్విరామంగా రెండు రాష్ట్రాల్లో 800 కిమీ మేర ప్రయాణిస్తూ గాలించారు. ఇందులో భాగంగా దాదాపు 1800 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఎట్టకేలకు గురువారం మహారాష్ట్రలోని మాలేగావ్‌ ప్రాంతంలో బాబును రెస్క్యూ చేశారు. మధ్య మండల డీసీపీ ఎన్‌.విశ్వప్రసాద్, అబిడ్స్‌ ఏసీపీ కె.వెంకట్‌రెడ్డితో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ పూర్తి వివరాలు వెల్లడించారు.

బీదర్‌ జిల్లాకు చెందిన ఎం.శివకుమార్‌ ఈ నెల 2న తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నగరానికి వలసవచ్చాడు. వీరి చిన్నకుమారుడే మూడేళ్ల రుద్రమణి. ఎలాంటి నివాసం లేని ఈ కుటుంబం పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద ఫుట్‌పాత్‌పై నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటోంది. 
మాలేగావ్‌ తాలూక అమన్వాడీ గ్రామానికి చెందిన శ్యామ్‌ భీమ్‌రావు సోలంకి పాలమూరు ఎత్తిపోతల పథకంలో పనిచేయడానికి వలసవచ్చాడు. అక్కడ రాళ్లు కొట్టే పని కష్టంగా ఉండ­టం­తో తన స్వస్థలానికి తిరిగి వెళ్లాలని భావించి ఈ నెల 7న మరో వ్యక్తితో కలిసి సిటీకి వచ్చాడు. 
ఇతడికి ఉన్న నలుగురు అక్కా చెల్లెళ్లకు వివాహాలు అయి, పిల్లలు కూడా పుట్టారు. ఇతడి ప్రవర్తన సరిగ్గా లేని కారణంగా 40 ఏళ్లు వచ్చినా వివాహం కాలేదు. పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద ఇతడు భోగిరామ్‌ అనే వ్యక్తితో కలిసి శివకుమార్‌ కుటుంబాన్ని కలిశాడు. 
తనతో వస్తే ముంబైలో పని ఇప్పిస్తానంటూ వారి­తో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రుద్రమణి ఇత­డికి దగ్గరయ్యాడు. శివకుమార్‌కు చెందిన సెల్‌­ఫోన్, నగదు పోవడంతో వాళ్లు తమ మకాంను గాంధీ భవన్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు మార్చారు. 
ఈ నెల 8న వీరి వద్దకు వచ్చిన శ్యామ్, భోగిరామ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్దామంటూ కోఠి వరకు తీసుకువెళ్లి వెనక్కు తెచ్చాడు. రాత్రి 7 గంట­లకు చిన్నారితో ఆడుకుంటున్నట్లు నటించాడు. తండ్రి సమీపంలోని ఓ హోటల్‌లో పని­కోసం, తల్లి నీటి కోసం వెళ్లడంతో అదును చూ­సు­కుని ఆ చిన్నారిని తీసుకుని ఉడాయించాడు.  
తిరిగి వచ్చిన తల్లిదండ్రులు భోగారామ్‌ను రుగ్రమణి విషయం అడగ్గా అతడు తనకు తెలియదన్నాడు. శ్యామ్‌ జాడ కూడా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో గాలించిన శివకుమార్‌ మరునాడు అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 
శ్యామ్‌కు సంబంధించిన ఏ వివరాలూ బాధితుల వద్ద లేవు. అతడు బాధిత కుటుంబానికి పరిచయమైనప్పుడు ముంబైలో పని ఇప్పిస్తానంటూ చెప్పినట్లు తెలుసుకున్న పోలీసులు మహారాష్ట్ర వాసిగా అనుమానించారు. సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.  
కిడ్నాప్‌ జరిగిన మెట్రో స్టేషన్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వర­కు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిం­చారు. ఆ రోజు రాత్రి అఫ్జల్‌గంజ్‌ వంతెన కింద ఉన్న మురికివాడలో తలదాచుకున్న శ్యామ్‌ మ­రుç­Üటి రోజు బయటకు వచ్చినట్లు తేలింది. 
చిన్నారితో సహా అక్కడ బస్సు ఎక్కి, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లిన ఇతగాడు బీహార్‌కు వెళ్లే ధనాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. మహారాష్ట్రలోని సేవా­గ్రామ్‌ రైల్వేస్టేషన్‌లో దిగిన ఇతడు అక్కడ నుంచి ఆటోలో వాద్రా స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ వి­దర్భ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి అలోక్‌ స్టేషన్‌లో దిగిపోయాడు. 
అక్కడ నుంచి బస్సులో మాలేగావ్‌ ప్రాంతానికి వెళ్లినట్లు తేలింది. ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను అబిడ్స్‌ పోలీసులు తనిఖీ చేసి ఇది నిర్ధారించారు. దీంతో మాలేగావ్‌ పోలీసులను సంప్రదించిన అధికారులు కిడ్నాప్‌ విషయం చెప్పారు. సీసీ కెమెరాల నుంచి సంగ్రహించిన ఫీడ్‌ను వారికి అందించారు.  
అక్కడి పోలీసులు తమ సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఈ ఫొటోలు పోస్ట్‌ చేసి సమాచారం తెలపమన్నారు. దీన్ని చూసిన అమన్వాడీకి చెందిన మహిళ విషయాన్ని రాజస్థాన్‌లో సైనికుడిగా పనిచేసే తన సోదరుడికి చెప్పింది. ఆయన మాలేగావ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం ఇచ్చారు.  
ఆయన ద్వారా సమాచారం అందుకున్న అబిడ్స్‌ పోలీసులు గురువారం అక్కడకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి రుద్రమణిని రెస్క్యూ చేశారు. కొన్నాళ్లు ఆ చిన్నారిని పెంచుకుని, ఆ తర్వాత విక్రయించాలనే శ్యామ్‌ ఈ నేరం చేశాడని పోలీసులు గుర్తించారు. 
తన కుటుంబీకులకు బాబు దొరికాడని, చుట్టుపక్కల వారికి తన సోదరి కుమారుడంటూ శ్యామ్‌ చెప్పుకొచ్చాడు. ఈ పది రోజులూ బాబుకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. రుద్రమణికీ ఇతడి దగ్గర ఆడుకునే అలవాటు ఉండటంతో అతడికీ ఇబ్బంది రాలేదు.  

చదవండి: టార్గెట్‌ వామన్‌రావే.. సాక్ష్యం ఉండొద్దనే భార్య హత్య 
చదవండి:  రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా?: కాంగ్రెస్‌
చదవండి: ఆవు బొప్పాయి పండును దొంగలించిదని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top