మా చావుకు ఎవరూ కారణం కాదు..

Couple commit suicide in hyderabad - Sakshi

హైదరాబాద్: ఇద్దరు కుమారుల తోటిదే లోకంగా బతికిన ఆ దంపతులు.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారులను చూసి తట్టుకోలేక ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయారు. పిల్లలనూ తమ వెంటే తీసుకెళ్లారు. గుండెల్ని మెలిపెట్టిన ఈ హృదయ విదారక ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కందిగూడలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన గాదె సతీష్‌ (39) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆయనకు భార్య వేద (35), ఇద్దరు కుమారులు నిషికేత్‌ (9), నిహాల్‌ (5) ఉన్నారు. ఉద్యోగరీత్యా సతీష్‌ కుటుంబంతో కలిసి 2021లో నగరానికి వచ్చారు. కుషాయిగూడ పరిధిలోని కందిగూడలో ఉన్న క్రాంతి పార్క్‌ రాయల్‌ అపార్టుమెంట్‌లో భార్యా పిల్లలతో నివసిస్తున్నారు. కాగా.. పెద్ద కుమారుడు నిషికేత్‌ బ్రెయిన్‌ సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. చిన్న కొడుడు నిహాల్‌ బాల్యం నుంచే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు.  

అపార్ట్‌మెంట్‌ బయట కనిపించకపోవడంతో.. 
శనివారం మధ్యాహ్నం వరకు సతీష్‌ కుటుంబ సభ్యులు అపార్టుమెంట్‌ బయట కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది ఫోన్‌ చేశారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో పైకి వెళ్లి కిటికిలోంచి చూడగా ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి డీసీపీ జానకి పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కుమారుల అనారోగ్యాన్ని తట్టుకోలేకనే దంపతులు సతీష్‌, వేద ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ‘మా చావుకు ఎవరు కారణం కాదు’ అనే సూసైడ్‌ నోట్‌ ఘటనా స్థలంలో లభ్యమైనట్లు వారు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

భార్యా పిల్లలకు తాగించి.. ఆపై తానూ తాగి.. 
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు చాలాచోట్ల వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. పిల్లలను చూస్తూ తల్లిదండ్రులు రోజురోజుకూ మానసికంగా కుంగిపోయారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి నిద్ర పోయే సమయంలో పొటాయం సైనెడ్‌ను చాయ్‌లో కలిపి ముందుగా భార్య వేదకు, ఇద్దరు పిల్లలకూ ఇచ్చి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత సతీష్‌ కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు 
భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top