మత్తుమందిచ్చి.. నగలు దోచేస్తారు

Couple Arrested In Shadnagar Assassination Case - Sakshi

అడ్డుకుంటే హత్యచేస్తారు

షాద్‌నగర్‌ హత్య కేసులో జంట అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి

శంషాబాద్‌ (హైదరాబాద్‌): ఇంట్లో అద్దెకు దిగుతారు.. ఆపై నమ్మించి మాయచేసి మత్తుమందిస్తారు.. ఆపై దోచుకుంటారు... ఈ క్రమంలో అడ్డుకునే వారిని హత్య చేసేందుకూ వెనుకాడరు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లిలో ఓ మహిళ హత్య కేసులో నిందితులైన జంటను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి బుధవారం షాద్‌నగర్‌ ఏసీపీ కుశాల్కర్‌తో కలిసి తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వర్‌రావు అలియాస్‌ వెంకటేష్‌ (33) వృత్తిరిత్యా మేస్త్రి. అతడు అనేక నేరాల్లో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. రొంపిచెర్ల మండలం ఇప్పర్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత సానుగొమ్ముల నాగలక్ష్మి (30)తో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు తదితర ప్రాంతాల్లో నివాసమున్న తర్వాత షాద్‌నగర్‌ చటాన్‌పల్లికి చేరుకున్నారు.

రాంనగర్‌ కాలనీలోని అవ్వారి బల్‌రాం ఇంట్లో గతేడాది నవంబర్‌లో అద్దెకు దిగారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బల్‌రాం భార్య సువర్ణ ఒంటిపై ఉన్న నగలు దోచేయాలనుకుని ఇద్దరూ పథకం పన్నారు. అప్పటికే ఓ మెడికల్‌ షాపు వ్యక్తితో పరిచయం పెంచుకున్న వెంకటేశ్వర్‌రావు నిద్రమాత్రలు కొన్నాడు. నవంబర్‌ 22న తమ ఇంట్లో చికెన్‌ వండామని, కల్లు కూడా తెచ్చామని సువర్ణను పిలిచారు. కల్లులో నిద్రమాత్రవేసి ఆమెకు ఇచ్చారు. పూర్తిగా స్పృహ కోల్పోతున్న సమయంలో సువర్ణ ఒంటిపై ఉన్న నగలు తీసే ప్రయత్నంలో జరిగిన ప్రతిఘటనతో ఆమెపై కూర్చుని గొంతునులిమి చంపేశారు. పుస్తెల తాడు, చెవికమ్మలు, మాటీలు తీసుకున్న నిందితులు ఇంటి గుమ్మం పరిసరాల్లో కారం పొడి చల్లి గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఆటోలు మారుస్తూ.. 
హత్య చేసిన తర్వాత నిందితులు ఆటోలో షాద్‌నగర్‌ వైన్స్‌ వద్దకు వెళ్లారు. వెంకటేశ్వర్‌రావు మద్యం తాగిన తర్వాత మరో ఆటోలో నందిగామ బస్టాప్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా మరో ఆటో ఎక్కిన దశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. అక్కడి నుంచి వెళ్లిన వీరు సూర్యాపేటకు వెళ్లి ఓ వ్యక్తి పరిచయంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో నగలు తాకట్టుపెట్టి రూ.లక్ష రుణం తీసుకుని కొంతకాలం బెంగళూరు, గుంటూరులో గడిపారు. డబ్బులు పూర్తిగా అయిపోయాక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇంటి యజమానురాలైన వద్ధురాలు ఒంటరిగా ఉండడంతో ఫిబ్రవరి 18న ఆమెకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి బంగారు నల్లపూసల దండ, బంగారు గాజులు, చెవికమ్మలు తీసుకుని పరారయ్యారు.

నేరం చేసి మూడు నెలల దాటడంతో ఎవరూ గుర్తుపట్టరనే ధీమాతో షాద్‌నగర్‌లో సాయన్న అనే వ్యక్తి వద్ద కుదువ పెట్టిన బంగారం విడిపించుకోడానికి బుధవారం ఉదయం అక్కడికి రావడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వెంకటేశ్వర్‌రావుపై విశాఖపట్నం, సత్తెనపల్లి, ప్రకాశం, మోత్కూరు, సంతమాగులురు, జిన్నారం, మేడ్చల్, ఎల్లారెడ్డి, పెనిగంజిప్రోలు, బోదన్‌లలో ఈ తరహా మోసాలకు పాల్పడిన కేసులున్నాయి. అనేక మార్లు జైలుకుపోయి వచ్చిన అతడు నాగలక్ష్మిని తోడుచేసుకుని మరోసారి వరుస నేరాలకు పాల్పడుతున్న తీరుకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి:
కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది..    
భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top