ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ?

Conflict Between Families Of Young Couple In Visakhapatnam - Sakshi

పెదవాల్తేరు (విశాఖ తూర్పు):విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువ జంట కుటుంబాలు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వాగ్వాదానికి దిగాయి. వీరికి సర్దిచెప్పడానికి పోలీసులు హైరానా పడాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రేసపువానిపాలెం దరి సిద్ధార్థనగర్‌కి చెందిన తాటిపూడి సీతారామ్‌ కుమారుడు ప్రశాంత్‌కుమార్‌ ఓ షోరూమ్‌లో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను, కైలాసపురానికి చెందిన మౌనిక గత ఏడాది డిసెంబర్‌ నుంచి ప్రేమించుకున్నారు.

గత నెలలో మౌనిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 14న వీరిద్దరూ కొత్తవలసలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు ప్రశాంత్‌కుమార్‌ ఇంటికి వచ్చారు. వెంటనే అతని తల్లిదండ్రులు వీరిని నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లి మిస్సింగ్‌ కేసు విరమింపజేశారు. ప్రస్తుతం మౌనిక గర్భిణికాగా తాను భర్త వద్దకు వెళ్లేదిలేదంటూ చెప్పడం గమనార్హం.

మహిళా చేతన పద్మను అరెస్టు చేయాలి 
మహిళా చేతన ప్రతినిధి పద్మ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశమని ఆహ్వానం పంపడంతో స్టేషన్‌కి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఆ సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అక్కడికి చేరుకుని పద్మను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువకుని తండ్రి సీతారామ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రేమించి పెళ్లిచేసుకున్న కుమారుడు, కోడలు చక్కగానే కాపురం చేసుకుంటున్నారని తెలిపారు. తమ కోడలు తల్లిదండ్రులు ఆమె మనసుని మార్చేశారని ఆరోపించారు.

నగరంలో ఎన్నో కాపురాలు కూలిపోవడానికి కారణమైన పద్మ అండ చూసుకుని తన కోడలు కాపురానికి రానంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి అయిన తన కోడలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం పద్మ ఆమెని డిశ్చార్జి చేయించి, స్టేషన్‌కి తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. కాపురం చేసుకుంటున్న తన కుమారుడు, కోడలు విడిపోవడానికి కారణమవుతున్న పద్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇరు కుటుంబాలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు. ప్రశాంత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మహిళా చేతన పద్మ మాటలు విని తన భార్య మౌనిక కాపురానికి రానంటుందని, పోలీసులు స్పందించి తమ కాపురం నెలబెట్టాలని కోరాడు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top