Vellore Jewellery Store Heist: వేలూరు జోస్‌ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపుకు కన్నం వేసిన దొంగ అరెస్ట్‌

Chennai Police Arrested A Man Who Robbed 15 KG Of Gold From Jos Alukkas Store - Sakshi

చెన్నై: వెల్లూరులోని ఓ నగల దుకాణంలో వారంరోజుల క్రితం గోడకు కన్నం వేసి 15 కిలోల బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే! ఐతే ఈ దోపిడీకి పాల్పడిన నిందితుడిని తమిళనాడు పోలీసులు అనతికాలంలోనే అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు ముమ్మర గాలింపులు చేసిన పోలీసులు నిందితుడి పట్టుకుని, అతని వద్ద బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే... యూట్యూబ్‌ వీడియోలు చూసి దోచుకోవడం ఎలాగో నేర్చుకుని పక్కాప్లాన్‌తో పనికానించాడీ ఈ ఘరానా దొంగ.

డిసెంబర్ 15న జోస్‌ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపు గోడ పగులగొట్టి, లోపలున్న15 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఐతే సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్‌తో సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసులకు మాత్రం అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడే అందుకు కారణం. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన 8 పోలీస్‌ టీమ్‌లు ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలించి సోమవారం నాడు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు కూచిపాళయం గ్రామానికి చెందిన టిఖారాం (22)గా గుర్తించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు, జ్యువెలరీ షాపు గోడకు రంధ్రం చేసి, శబ్దం రాకుండా షాపులోకి ప్రవేశించేందుకు10 రోజులపాటు ప్రాక్టీస్‌చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే సీసీటీవీని ఎలా బ్లాక్ చేయాలో కూడా యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాడట. వీలైనంత త్వరగా సంపన్నుడు కావాలని ఇంతటి పన్నాగంపన్నిన టిఖారాం అనూహ్యంగా పోలీసుల వలలో చిక్కుకోవడంతో గుట్టురట్టయ్యింది. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనంచేసుకుని, ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top