Gunture: జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. పగటి పూట మారువేషంలో రెక్కీలు రాత్రికి..!

Cheddi Gang Commotion In The Gunture District - Sakshi

5 నుంచి 8 మంది సభ్యుల ముఠా! 

పోలీసుల కంటికి దూరమైన కునుకు!

చెడ్డీ గ్యాంగ్‌...  జిల్లాలో ఇప్పుడు అందరినోటా భయం భయంగా వినిపిస్తున్న పదం. దొంగతనం చేయడంలో ఆరితేరిన ఈ ముఠా సభ్యుల నిర్వాకం.. ముందుగా చేసే రెక్కీ.. పని పూర్తి చేసే విధానం.. అంతా కొత్తదనమే! పక్కా వివరాలతో  ఇంటికి స్కెచ్‌ వేస్తారు.. దోచేస్తారు. ఎవరైనా వీరి పనికి అడ్డొస్తే..  వాడికి అదే ఆఖరి రోజు. గుజరాత్‌ నుంచి బయలుదేరిన ఈ గిరిజన తెగ సభ్యులు కొన్ని రోజులుగా  పోలీసులకు, జిల్లావాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి):  చెడ్డీగ్యాంగ్‌ జిల్లాలో ప్రవేశించిందన్న విషయం ఈనెల మొదట్లో కుంచనపల్లి, తాడేపల్లిలో జరిగిన రెండు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అటు ప్రజలకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.  ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా తమ పనిచేసుకుని వెళ్లే వీరి ఆగడాలు అంతా ఇంతా కాదు.   

‘చెడ్డీ’ వేసి 34 ఏళ్లు! 
చెడ్డీగ్యాంగ్‌ పుట్టి 34 సంవత్సరాలు. 1987లో చెడ్డీగ్యాంగ్‌  దొంగతనాలు చేయడం ఆరంభించింది. ఇలాంటి గ్యాంగ్‌ ఒకటి ఉందని, వీరు దొంగతనాలు చేస్తారని అప్పటి ఉమ్మడి రాష్ట్ర పోలీసులు 1999లో గుర్తించారు. దాదాపు  పుష్కరకాలం అనంతరం వీరు ఉన్నారని విషయం స్పష్టమైంది. మొదటి సారిగా హైదరాబాద్‌లో సీసీ  కెమెరాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్‌ దృశ్యాలు రికార్డు కావడంతో బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకోవడం అనేది పోలీసులకు  సవాలుగా మారింది. చెడ్డీగ్యాంగ్‌ పుట్టింది గుజరాత్‌లోని దావోద్‌ జిల్లాలోని గూద్‌బాలా తాలూకా ఓ గిరిజన గ్రామం..  

చెడ్డీ గ్యాంగ్‌ స్టయిలే వేరు! 
ఈ చెడ్డీగ్యాంగ్‌ పెద్ద రాంజీ. తొలుత ఐదుగురు యువకులతో  చెడ్డీగ్యాంగ్‌ను తయారు చేశారు. వారికి బాగా శిక్షణ ఇచ్చాడు. నాయకుడు రాంజీ వీరికి దొంగతనాలు చేయడానికి కొన్ని సూత్రాలను పాటించాలని కూడా చెప్పాడు.  అలా మొదలైన ఆ ఒక్క గ్యాంగ్‌ పెరుగుతూ వచ్చింది. కొన్ని పదుల గ్యాంగ్స్‌ పుట్టుకొచ్చాయి. కానీ దొంగతనం చేయడంలో అందరిదీ ఒకటే స్టయిల్‌. ఈ ముఠాలు ముందుగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ముంబై తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు. అక్కడి పోలీసులు వీరిపై కన్ను వేయడంతో మకాం మారుస్తూ వస్తున్నారు. 

దొంగతనం చేసేదిలా..  
ఇక ఎంచుకున్న ప్రదేశానికి రాత్రి 12 గంటలలోపే చేరుకుంటారు. నిర్మానుష్య ప్రాంతంలో నక్కి దాడి చేయడానికి రెడీ అవుతారు. ఒక్కోసారి మిద్దెల మీద దర్జాగా కూర్చుని సమయం కోసం ఎదురు చూస్తారు. అంతా గాఢ నిద్రలోకి జారుకునే సమయమైన 3 గంటల ప్రాంతంలో వీరి అటాక్‌ మొదలవుతుంది. అటాక్‌ చేసే ముందు వీరు తమ డ్రస్‌కోడ్‌లోకి మారిపోతారు. శరీరం అంతా ఆయిల్‌ పూసు కుంటారు. ఒంటిమీద ఒక్క చెడ్డీ తప్ప ఏమీ ఉంచుకోరు. చెప్పులు కాలికి వేసుకోకుండా నడుముకి కట్టుకుంటారు. పదునైన కత్తులు, ఇనుప రాడ్స్‌ దగ్గర ఉంచుకుంటారు. నేరుగా తలుపులు, కిటికీలు, తాళాలు పగలకొట్టే వీరు ఇంట్లోకి ప్రవేశిస్తారు. సాధారణంగా వీరు మనుషుల మీద అటాక్‌ చేయరు. ఇంట్లో వారు నిశ్శబ్దంగా ఉంటే ఏమీ అనరు. ఒకవేళ ఎదురు తిరిగితే ఏ మాత్రం విచక్షణ చూపడానికి వెనుకాడరు. దొంగతనం చేసిన ఇంట్లోనే భోజనం చేయడం, అక్కడే మలమూత్ర విసర్జన చేయడం వీరి వృత్తిలో భాగం!
 
 ఐకమత్యమే వీరి మహాబలం! 
చెడ్డీగ్యాంగ్‌లోని ఒక్కో గ్రూప్‌లో 5 నుంచి 8  మంది సభ్యులుంటారు. తమకి కావాల్సినంత దోచుకుని ఆ డబ్బుని అందరూ సమానంగా పంచుకుని విడివిడిగా మాత్రమే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. పొరపాటున వీరిలో ఏ ఒక్క రు దొరికినా మిగతా వారి ఆచూకీ ఏ మాత్రం వెల్లడించరు. వీరిలో  ఐకమత్యం అంత బలంగా ఉంటుంది. వీరు దొంగతనం చేసిన తరువాత రైలు మార్గంలోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. ఎందుకంటే వీరు రైలులో గుంపుల మధ్య తప్ప ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. చెడ్డీగ్యాంగ్‌ ఆంధ్రప్రదేశ్‌ను టార్గెట్‌ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో వీరు పాతిక ఇళ్లల్లో  దొంగతనాలు చేసినట్లు సమాచారం.  

ప్రత్యేక నిఘా   
రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్‌ ప్రవేశించిందనగానే 13 జిల్లాల్లోని పోలీసులను అలర్ట్‌ చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి  చెడ్డీగ్యాంగ్‌ వివరాలు సేకరించేందుకు గుజరాత్‌కు మూడు టీంలు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 

ఒక్కో స్టేషన్‌కు ఒక్కో సీఐ 
గుంటూరు జిల్లా తాడేపల్లి కుంచనపల్లిలో చెడ్డీగ్యాంగ్‌ దొంగతనాలకు ప్రయత్నించారని తెలియడంతో జిల్లా అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్, రూరల్‌ ఎస్‌పి విశాల్‌ గున్నీలు ఒక్కో స్టేషన్‌కు ఒక్కో సీఐను కేటాయించి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు. అర్బన్‌ పరిధిలో మొత్తం 30 టీంలు ఏర్పాటు చేయగా రూరల్‌ పరిధిలో పలు టీంలు ఏర్పాటు చేశారు. వీరు కాకుండా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే సిబ్బంది అంతా రాత్రి సమయంలో తప్పని సరిగా విధులు నిర్వహించాలని ఆదేశించడంతో సివిల్‌ డ్రస్‌లో చెడ్డీగ్యాంగ్‌ కోసం అన్వేషిస్తూనే ఉన్నారు.

పక్కాగా దొంగతనం!   
వీరు  ఏడాది పాటు దొంగతనాలు చేయరు. వారి అవసరాలకి తగ్గట్లు సీజనల్‌గా కొన్ని రోజులు మాత్రమే దొంగతనాలు చేస్తారు. దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న నగరానికి చెడ్డీ గ్యాంగ్‌ నెలరోజుల ముందే చేరుకుంటుంది. వీరిలో కొంత మంది కూలీలుగా పనికి కుదురుతారు. మరికొంత మంది పగటి వేళల్లో కుర్తా, పైజామా ధరించి భిక్షాటన చేస్తూ, బెలూన్స్, పక్క పిన్నీసులు అమ్ముతూ మారువేషాల్లో ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు. ఈ రెక్కీ తరువాత రెండు రోజులు సిటీకి దూరంగా ఉండేలా చూసుకుంటారు. ఈ రెండు రోజుల్లో ఆ ఇంట్లో వాళ్లు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు? ఆ ఇంట్లో ఎంతమంది నివశి స్తున్నారు? ఆ ఇంట్లో కాపలాకి కుక్క ఉందా? లేదా? ఇంటి ముందు ఆరేసిన ఖరీదైన బట్టలు, పార్కింగ్‌ చేసిన బైకులు, కార్లను బట్టి ఆ ఇంట్లో ఎంత వరకు డబ్బు దొరకవచ్చు అన్న విషయాలను పసిగడతారు. 

నిఘా పటిష్టం చేశాం
అర్బన్‌ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌పై కదలికలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నాం.  ప్రతిచోటా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. చెడ్డీగ్యాంగ్‌పై త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం.   
– ఆరీఫ్‌ హఫీజ్, అర్బన్‌ ఎస్పీ 

చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top