టీడీపీ నేత ఆలపాటిపై కేసు నమోదు

Case Registered Against TDP Leader Alapati Rajendra Prasad‌ - Sakshi

ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిపై దాడి, పాలకవర్గానికి బెదిరింపు

తన సోదరుడిని డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించడంపై ఆలపాటి ఆగ్రహం

సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని చినకాకాని గ్రామంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ ఆసుపత్రి పాలకవర్గంలో వివాదాలు పోలీస్‌స్టేషన్‌ దాకా చేరాయి. ఈ వివాదాల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పాలకవర్గంలో విభేదాలు తలెత్తడంతో ఎన్‌ఆర్‌ఐ పాలకవర్గంలో డైరెక్టర్‌గా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సోదరుడు రవిని ఆ పదవి నుంచి తొలగించారు. దీనిపై కోర్టులో కేసు కొనసాగుతోంది.

గత టీడీపీ పాలనలో ఆలపాటి ఆసుపత్రి పాలకవర్గాన్ని బెదిరించి తన ఆధిపత్యం కొనసాగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2019లో టీడీపీ ఓటమితో ఆలపాటి ఆధిపత్యానికి గండిపడింది. రవిని పాలకవర్గంలోకి తిరిగి తీసుకోకపోతే చంపుతానని రాజేంద్రప్రసాద్‌ బెదిరించారని, అక్రమంగా ఆసుపత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారని ప్రస్తుత వైస్‌ప్రెసిడెంట్‌ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌ మంగళగిరి రూరల్‌ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top