కడుపు కోతే మిగిలింది.. 

Boyfriend Assassinated His Girlfriend in Chittoor District - Sakshi

ప్రేమోన్మాది చేతిలో గారాలపట్టి హతం

ఆదుకునే సమయంలో అనంతలోకాలకు 

తల్లడిల్లిన కుటుంబం

కంటతడి పెట్టించిన తండ్రి మాటలు

‘ప్లేట్లు కడిగాను. సర్వర్‌గా పనిచేశాను. అదే హోటల్‌లో ప్రధాన చెఫ్‌గా చేరాను. పైసాపైసా కూడబెట్టి ఉన్నతంగా చదివించాను. కళ్లెదుటే ఎదుగుతున్న కూతురుని చూసి సంబరపడ్డాను. కుటుంబానికి తోడుగా.. జీవితంలో స్థిరపడే విధంగా దేవుడు దీవించాడని ఆనందించాను. వెంటబడుతున్న వాడి నుంచి కాపాడాలని పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కాను. కానీ ఆ భగవంతుడు కూడా కనికరించలేదు. నా గారాల పట్టి ప్రాణాలను ఆ రాక్షసుడు అతి కిరాతకంగా తీసుకెళ్లిపోయాడు. మేము ఎలా బతికేది తల్లీ’ అంటూ చిత్తూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన సుస్మిత తండ్రి వరదయ్య రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది.

చిత్తూరు అర్బన్‌: నగరంలోని రిడ్స్‌పేటకు చెందిన వరదయ్య, లత దంపతులకు సుస్మిత, సునీల్‌ సంతానం. పెద్దగా చదువుకోని వరదయ్య పెళ్లయ్యి భార్య, పిల్లల్ని పోషించడానికి 25 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. తొలినాళ్లలో పనులు దొరక్క ఓ హోటల్‌లో చేరి పిల్లలు ఇద్దరినీ ఇంగ్లిషు మీడియంలో చదివించాడు. సాంబయ్యకండ్రిగలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాడు. భార్య లత అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కుమార్తె సుస్మితకు వేలూరు సీఎంసీ వైద్య కళాశాలలో  సీటు రావడం.. కోర్సు పూర్తయ్యాక మూడు నెలల క్రితం ఆమెకు గుడిపాల సమీపంలోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం రావడం అదృష్టమనుకున్నాడు.

నెలకు రూ.17 వేలు జీతం. నైట్‌డ్యూటీలతో కలిపి మూడు రోజుల క్రితం రూ.18 వేల జీతాన్ని చేతిలో పెట్టడంతో ఇక తన కష్టం తీరిపోయిందని అనుకున్నాడు. ప్రేమ పేరిట చదువు, ఉద్యోగం లేని చిన్నా వేధించడంతో ఈ ఏడాది జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీలాపల్లె పోలీసులు ఐపీసీ 354–డీ సెక్షన్‌ కింద నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టి అతన్ని అరెస్టు చేశారు.

తర్వాత బెయిల్‌పై వచ్చిన అతను తమపై పగ పెంచుకుంటాడేమోననుకుని మళ్లీ వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. భవిష్యత్‌లో ఎప్పుడూ సుస్మితతో వివాదం పెట్టుకోకూడదని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేయడంతో అతను మారాడని భావించాడు. తీరా సుస్మితను కిరాతకంగా కత్తితో పొడిచి హత్యచేసిన చిన్నా చివరకు తనూ తనువు చాలించాడు. కూతురి రక్తంతో ఆ ఇల్లంతా తడిసి ముద్దవడం చూసిన తండ్రి తట్టుకోలేక పోయాడు. గుండెలు బాదుకుంటూ చిట్టితల్లిని తీసుకెళ్లిపోయావా దేవుడా.. అంటూ రోదించడం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది.

చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి..  
ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top