నగరంలో బాలుడి కిడ్నాప్‌ 

Boy Kidnapped In Visakhapatnam - Sakshi

సకాలంలో స్పందించిన టూ టౌన్‌ పోలీసులు 

విజయనగరానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఖాకీలు 

వివరాలు వెల్లడించేందుకు నిరాకరణ  

అల్లిపురం (విశాఖ దక్షిణ): నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో బాలుడు కిడ్నాప్‌ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు... ఈ నెల 21న రాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆర్టీసీ కాంప్లక్స్‌ వద్ద భిక్షాటన చేసుకునే దంపతులకు రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రాత్రి భోజనాలు చేసిన తర్వాత వారు బాలుడితో కలిసి టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో గల ఇరానీ టీ దుకాణం వద్ద నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు తల్లిదండ్రుల చెంతన నిద్రిస్తున్న బాలుడిని తీసుకుని వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు ఆటో నంబర్‌ను నమోదు చేసుకున్నారు. దాని ఆధారంగా గోపాలపట్నం రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన సిరిమల్లెచెట్టు శ్రీను టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పరిశీలనలో ఏపీ 31 వై 3371 నంబరు గల ఆటోలో నిందితులు బాబుని తరలించినట్లు గుర్తించారు. దీంతో ఆటో నెంబరు ఆధారంగా నిందితులను విజయనగరం జిల్లా బంగారుమెట్ట ముస్లిం వీధికి చెందిన పటాన్‌ సల్మాన్‌ఖాన్‌ (19), షేక్‌ సుబాణీ (19), బండారు రోషన్‌ రాజు (20)గా గుర్తించారు. బాలుడు ప్రస్తుతం రోషన్‌ రాజు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు.  

దత్తత కోసమే అపహరణ..?  
బాలుడిని కిడ్నాప్‌ చేసింది దత్తత కోసమేనని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన బండారు రోషన్‌ రాజు మేనత్త సింహాచలంలో ఉంటుంది. తనకు ఒక పిల్లాడు దత్తత కావాలని ఆమె రాజుని అడిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న 9 గంటల సమయంలో రాజు, మరో యువకుడు సింహాచలంలో గల తన మేనత్తకు భోజనం తీసుకెళ్దామని ఆటోలో ఆర్టీసీ కాంప్లక్స్‌కు వచ్చారు. అక్కడ బిక్షమెత్తుకుంటున్న దంపతుల చేతిలో బాలుడుని రాజు చూశాడు. ఆ బాలుడుని ఎలాగైనా అపహరించి ఆంటీకి దత్తత ఇవ్వాలని నిర్ణయించుకుని అక్కడే వేచి ఉన్నారు. తల్లిదండ్రులు నిద్రించిన తర్వాత బాలుడిని అపహరించి విజయనగరం తీసుకెళ్లిపోయి రోషన్‌ రాజు ఇంట్లో ఉంచారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులు ఉపయోగించిన ఆటో నంబర్‌ సాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని, బాలుడుని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అన్న విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై టూ టౌన్‌ సీఐ కె.వెంకటరావును వివరణ కోరగా సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top