బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి

Boy Death Tragedy In Karimnagar - Sakshi

సాక్షి, కోరుట్ల(కరీంనగర్‌): బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి హాజరై.. తెల్లవారుజామున పెరుగు తెస్తామని ఇద్దరు మైనర్లు మోటర్‌సైకిల్‌పై వెళ్లగా ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆడెపు ప్రసాద్‌ గృహాప్రవేశానికి అతని దగ్గరి బంధువుల అబ్బాయి ఆడెపు రోహిత్‌(16) హాజరయ్యాడు.

బుధవారం తెల్లవారుజామున గృహాప్రవేశం ముగియగా సత్యనారాయణ వ్రతం కోసం పెరుగు అవసరం పడింది. అక్కడే ఉన్న ఆడెపు రోహిత్, మరో బంధువుల అబ్బాయి మనోజ్‌(14)తో కలిసి మోటార్‌సైకిల్‌పై తెల్లవారుజామున 5 గంటలకు పైడిమడుగు శివారులోని పెరుగు విక్రయ కేంద్రం వద్దకు వెళ్దామని బైక్‌పై బయలుదేరారు. ఊరు దాటి కొంత దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మోటర్‌సైకిల్‌ నడుపుతున్న రోహిత్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. మనోజ్‌కు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. దొంగచాటుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ ప్రమాదానికి కారణమైనట్లుగా భావిస్తున్నారు.

మనోజ్‌ది మహారాష్ట్రలోని భీవండి కాగా శుభకార్యం కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. రోహిత్‌ తల్లి వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్‌ కల్లూర్‌ మాడల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్‌ తండ్రి సత్యనారాయణ ఉపాధి కోసం గల్ప్‌ దేశాల్లో ఉంటున్నాడు.  

చదవండి: కంప్యూటర్‌ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top