రామకృష్ణది పరువు హత్య కాదు

Bhuvanagiri ACP Venkat Reddy Reveals Facts About Ramakrishna Case - Sakshi

ఆస్తి తగాదాలతోనే చంపేశారు 

11 మంది ప్రమేయం ఉంది 

నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం 

మిగతా వారిని విచారిస్తున్నాం 

భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి 

భువనగిరి క్రైం/గజ్వేల్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణది పరువు హత్య కాదని, ఆస్తి తగాదాల హత్యగానే భావిస్తున్నట్లు భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. హత్య కేసులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఏ1గా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం, ఏ2గా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల యాదగిరి (బీబీనగర్‌ పీఎస్‌లో హోంగార్డు), ఏ3గా వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన దంతూరి రాములు, ఏ4గా మోత్కూర్‌కు చెందిన సయ్యద్‌ లతీఫ్, ఏ5గా సిద్దిపేట జిల్లా యెల్లారెడ్డి నగర్‌కు చెందిన గోలి దివ్య, ఏ6గా సిద్దిపేట జిల్లా ఇందిరా నగర్‌ కు చెందిన మహ్మద్‌ అప్సర్, ఏ7గా సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌కు చెందిన పొలసం మహేశ్, ఏ8గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మహ్మద్‌ సిద్దిఖీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్‌లను ఏ9, ఏ10, ఏ11 నిందితులుగా పేర్కొన్నారు.

సోమవారం సయ్యద్‌ లతీఫ్, గోలి దివ్య, మహ్మద్‌ అప్సర్, పొలసం మహేశ్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ చెప్పా రు. నిందితుల నుంచి ఓ బొమ్మ పిస్టల్, రెండు కొడవళ్లు, సుత్తి, రూ.లక్ష నగదు, ఇండికా కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జమ్మపురం సర్పంచ్‌ అమృతరావును సాక్షిగా పేర్కొన్నారు.  

నిమ్మతోటలోకి తీసుకెళ్లి.. 
భూమిని చూపించడానికి జమ్మపురం సర్పంచ్‌ అమృతరావు ఈ నెల 15న రామకృష్ణను భువనగిరి పట్టణంలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లారు. అమృతరావుతో వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో భార్గవి 16న పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమృతరావును పోలీసులు విచారించగా లతీఫ్‌ అతని అనుచరులు రామకృష్ణను గుండాల మండలం రామారంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లి తాడుతో కట్టి సుత్తి, బండ రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారని చెప్పినట్టు ఏసీపీ తెలిపారు.

శవాన్ని గోనె సంచిలో కట్టి టాటాబోల్ట్‌ కారులో పెట్టి అమృతరావును కూడా ఎక్కించుకుని బయలుదేరారని, కిలోమీటరు దూరం వచ్చాక అతన్ని అక్కడే వదిలేశారని, ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు సిద్దిపేటకు వెళ్లినట్లు తెలిపారు. అమృతరావు సమాచారం మేరకు లతీఫ్, అతని భార్య దివ్య, మహేశ్, అప్సర్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు చెప్పారు.  

ఆస్తి కోసం మామను బెదిరించడంతో.. 
కొంతకాలం కిందట రామకృష్ణ ఉద్యోగం పోవడంతో మామ వెంకటేశంను ఆస్తిలో భాగం ఇవ్వాలని, లేకపోతే కోర్టులో కేసు వేస్తానని రామకృష్ణ బెదిరించాడని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశం రామకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడని ఏసీపీ తెలిపారు.హోంగార్డు యాదగిరి ద్వారా రూ.10 లక్షలకు లతీఫ్‌తో సుపారీ మాట్లాడుకుని రూ.6 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారన్నారు.

గుండాల మండలం రామారంలో దారుణంగా హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం గ్రామంలోని కొండపోచమ్మ దేవాలయం దగ్గరలోని గోతిలో పాతిపెట్టారన్నారు. విచారణలో ఈ విషయాన్ని పోలీసులకు లతీఫ్‌ తెలపగా వెంటనే అక్కడికెళ్లి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు. 

తల, మెడ భాగాల్లో తీవ్రగాయాలు
రామకృష్ణ తలకు తీవ్ర గాయమైందని, మెడ చుట్టూ ఉరేసినట్టు స్పష్టమైన గాయం కనిపిస్తోందని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించారు. నుదుటిపై, తల వెనుకభాగంలో గాయాలున్నాయన్నారు. చెవులు, ముక్కులోంచి రక్తం వచ్చిందని.. వీపు వెనుక కూడా గాయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మూత్రం పోసే నాళం వద్ద కూడా బలమైన గాయం కనిపించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి తీసుకెళ్లారు. 6 నెలల పసికందు, భార్గవికి అన్యాయం చేశారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top