ఆధారాలు దొరక్కుండా ఆరు హత్యలు

Assassination Gang Arrested In Krishna District - Sakshi

హంతక ముఠా అరెస్టు

22 నేరాల్లో ఐదుగురి హస్తం

నిందితులంతా విజయవాడ వాసులే

పోరంకి, తాడిగడపలో నాలుగు హత్యలు

కంచికచర్లలో వృద్ధ దంపతుల్ని చంపిన నేరగాళ్లు

విలేకరుల సమావేశంలో సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడి 

సాక్షి, అమరావతి బ్యూరో: ఒంటరి మహిళలను అత్యంత క్రూరంగా హత్యలు చేస్తున్న ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న పోరంకి సెంటర్‌లో ఉన్న కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఏటీఎం చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు పట్టుకోవడంతో వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ సమావేశ మందిరంలో సీపీ బత్తిన శ్రీనివాసులు కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

పెనమలూరు మండలం పోరంకి, తాడిగడపకు చెందిన వేల్పూరి ప్రభుకుమార్, సుంకర గోపి రాజు, పొనమాల చక్రవర్తి అలియాస్‌ చక్రి, మోరం నాగ దుర్గారావు అలియాస్‌ చంటి, మద్ది ఫణీంద్రకుమార్‌లు ముఠాగా ఏర్పాడ్డారు. వీరిలో ప్రభు, చక్రి, చంటి ఆటో డ్రైవర్లు. సుంకర గోపి ఆటోపై కూరగాయల వ్యాపారం చేస్తాడు. ఫణీంద్ర పెయింటర్‌. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని నేరాలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు.  ఇంటికి రెండువైపులా తలుపులు ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకున్నారు. అనుమానం రాకుండా అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి సహజ మరణంలా హత్యలు చేయాలని ప్రణాళికలు రచించారు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం రాదని, పైగా కరోనా సమయంలో చనిపోయిన వారిని త్వరగా ఖననం చేస్తారనే ఉద్దేశంతో వృద్ధులే లక్ష్యంగా ఈ తరహా నేరాలకు పాల్పడ్డారు.

ఆరు హత్యలు.. 40 తులాల బంగారం.. 
ఐదు కేసుల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులను హతమార్చి సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. మృతులపై శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో సహజమరణాలుగా భావించిన వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ఏటీఎం చోరీ కేసులో విచారణలో పోలీసుల కనబరిచిన ప్రతిభ వల్ల హత్యలు బయటపడ్డాయి. నిందితుల వేలిముద్రలు సేకరించి జిల్లాలో ఇతర ఘటనా స్థలాల్లో లభించిన వేలిముద్రలతో సరిపోల్చి చూడగా కంచికచర్లలో వృద్ధ దంపతులను హత్య చేసింది వీరేనని తేలింది. తర్వాత లోతుగా విచారించగా పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితులు చేసిన నేరాలు..  
నిందితులు మొదటి హత్యను 2020 అక్టోబరులో పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో చేశారు. పోరంకి గ్రామంలోని విష్ణుపురం కాలనీలో ఒంటరిగా నివాసం ఉండే నళిని(58)అనే మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
రెండో హత్యను 2020 నవంబరులో అదే పోలీసు స్టేషన్‌ పరిధిలోనే చేశారు. పోరంకి గ్రామం తూముల సెంటర్‌ సమీపంలో నివాసం ఉండే సీతా మహా        లక్ష్మి(63) అనే వృద్ధురాలిని హత్య చేశారు.  
కృష్ణా జిల్లా కంచికచర్లలో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి నిద్రపోతున్న వృద్ధదంపతులు నాగేశ్వరరావు(80), ప్రమీలారాణి(75)లను 2020 డిసెంబరులో హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలను దొంగిలించారు.   
2021 జనవరి నెలలో పెనమలూరు మండలం తాడిగడప కార్మికనగర్‌ కట్ట వద్ద ఒంటరిగా ఉంటోన్న తాళ్లూరు ధనలక్ష్మి(58) అనే మహిళను హత్య చేశారు.  
అలాగే మార్చి నెలలో తాడిగడప కార్మికనగర్‌లో మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి, ఇంటోల బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారు.
ఇదే ఏడాది జూన్‌లో పోరంకి గ్రామంలోని పోస్టాఫీసు సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న పాపమ్మ(85) అనే వృద్ధురాలిని హత్య చేసి ఆభరణాలు దొంగిలించారు.

రెక్కీ నిర్వహించిన ప్రాంతాలు.. 
నిందితులు ఇప్పటి వరకు చేసిన నేరాలు కాకుండా విజయవాడ నగరంలోని కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరులో ఒంటరి వృద్ధులు ఉండే నివాసాలను, గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరిలోనూ ఈ తరహా నేరాలు చేయడానికి రెక్కీ నిర్వహించారు. అయితే నిందితులను అరెస్టు చేయడం ద్వారా వారు తర్వాత చేయనున్న నేరాలను నిరోధించాం.

పోలీసులకు రివార్డులు..  
హంతక ముఠా చేసిన నేరాలను వెలుగులోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన పెనమలూరు సీఐ ఎం. సత్యనారాయణ, ఎస్‌ఐ వి.వెంకటేష్, హెడ్‌కాన్‌స్టేబుల్‌ రెహమాన్, కాన్‌స్టేబుల్‌ రమణలను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.. 
కమిషనరేట్‌ పరిధిలో ఒంటరిగా జీవించేవాళ్లు ఇకపై తమ ఇళ్లకు సీసీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. ఆపత్కాలంలో సమీప పోలీసుస్టేషన్‌ ఫోన్‌ నంబరు, డయల్‌–100, ఏపీ పోలీసు సేవా యాప్, పోలీసు వాట్సాప్‌ నంబరు, దిశ యాప్‌ల ద్వారా సమాచారం ఇస్తే వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడతారు.

చదవండి: కోడలిని వేధించిన పాపం..!  
పక్కాగా రెక్కీ.. మరో 10 మందిని చంపేందుకు స్కెచ్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top