నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది..

Arun Kumar traps nine women and forced them to prostitution - Sakshi

పెళ్లి పేరుతో 9 మంది మహిళలకు వల

వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి

లేదంటే చంపేస్తానని బెదిరింపులు

విశాఖలో నిత్య పెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌ అరాచకాలు 

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 9 మంది మహిళల్ని మోసగించిన నయవంచకుడి కథ విశాఖలో వెలుగులోకి వచ్చింది. గంజాయి రవాణా చేస్తూ, మహిళలను లోబరచుకుని.. వారిని వ్యభిచారం చేయాలని బెదిరిస్తున్న మోసగాడు అరుణ్‌కుమార్‌ ఉదంతమిది. ఏ అండా లేని మహిళలను తోడుగా ఉంటానని కొందరిని, పెళ్లి  చేసుకుంటానని చెప్పి కొందరిని లోబరచుకున్నాడు. కొందరిని పెళ్లి చేసుకున్నాడు. గంజాయి రవాణా కేసులో, మహిళల్ని మోసగించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడి అరాచకాలను తట్టుకోలేని బాధిత మహిళలు పోలీసుల్ని ఆశ్రయించారు. 

మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడి బండారం బట్టబయలైంది. పోలీసుల విచారణలో అరుణ్‌కుమార్‌ అరాచకాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ధనాల అరుణ్‌కుమార్‌ (33) చిన్నతనంలోనే విశాఖలో అమ్మమ్మ ఇంటికి వచ్చేశాడు. గంజాయి రవాణా చేయసాగాడు. మహిళలను ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరచుకునేవాడు. తాను పెద్ద వ్యాపారినని చెప్పి కొందరిని మోసం చేశాడు. తను చెప్పినట్లు వినకపోతే కత్తితో చంపేస్తానని బెదిరించేవాడు. ఇప్పటివరకు 9 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసి.. వ్యభిచారం రొంపిలోకి దించే ప్రయత్నం చేశాడు. గతంలో అనకాపల్లికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేసి ఒకసారి, గంజాయి రవాణా కేసులో రెండుసార్లు జైలుకి వెళ్లాడు. గతంలో మహిళల అక్రమ రవాణా కేసులో కూడా నిందితుడు. అరుణ్‌కుమార్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై డీజీపీ గౌతం సవాంగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. 

బాధితులు వీరే..
నర్సీపట్నంలో ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల మహిళకు గంజాయి వ్యాపారం అలవాటు చేసి భర్త నుంచి దూరం చేశాడు. వ్యాపారంలో వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడు. చింతపల్లి సమీప గ్రామంలో 18 ఏళ్ల యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు సంపాదించమంటూ ఒత్తిడి తెచ్చిన అతడిని దూరం పెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు అందింది. యువతిని ప్రేమిస్తున్నానని,  పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తుండడంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించింది. మృతిచెందిన తన స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తాననడంతో ఆమె కూడా మహిళా సంఘాలకు తన కష్టాన్ని తెలిపింది. వీరే కాకుండా మరో నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, వ్యభిచారం చేయమని వేధిస్తున్నాడు. బాధిత మహిళలతో కలిసి బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ.. నిత్య పెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ప్రత్యేకాధికారితో విచారణ
మార్చి 18న వాట్సాప్‌ ద్వారా సీపీ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు వచ్చింది. కంట్రోల్‌ రూమ్‌ నుంచి కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కి కేసు పంపించారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెం.207/2021 నమోదు చేశారు. దిశా పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 18న అరుణ్‌కుమార్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. వ్యభిచారం, గంజాయి రవాణా కేసులో అరుణ్‌కుమార్‌ను 2020 జూలైలో అనకాపల్లి టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనకాపల్లి, నర్సీపట్నంలో అమ్మాయిలను మోసం చేసిన కేసులో అరెస్టయి.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగిని నియమించాం. 

– మనీష్‌కుమార్‌ సిన్హా, విశాఖ  సీపీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top