చాట్‌బాట్‌ దూకుడు..సెల్‌ఫోన్ల రికవరీలో ‘అనంత’ పోలీసుల సత్తా 

Anantapur District Police Recover Stolen Cell Phones - Sakshi

ఇప్పటికే 5,077 ఫోన్లు బాధితులకు అందజేత

ఏపీతో పాటు 15 రాష్ట్రాల బాధితులకు సేవలు

ఇతర ప్రాంతవాసులకు ‘ఉచిత డోర్‌ డెలివరీ‘

అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌:  ఫోన్‌ పోయిందా.. గోవిందా అనుకునే రోజులు పోయాయి. పోగొట్టుకున్న ఫోన్‌ను పోలీసులు వెతికి మరీ ఉచితంగా ఇంటికి చేరుస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘చాట్‌బాట్‌’ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. పోయిందనుకున్న సెల్‌ఫోన్‌ తిరిగి చేతికి అందడంతో బాధితులు ‘అనంత’ పోలీసులను అభినందిస్తున్నారు. 

5,077 ఫోన్ల రికవరీ.. 
చాట్‌బాట్‌ సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే రూ.8.25 కోట్లు విలువ చేసే 5,077 మొబైల్‌ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం ఒక్కరోజే  700 మొబైల్‌ ఫోన్లను బాధితులకు ఎస్పీ ఫక్కీరప్ప అందజేశారు. మొబైల్‌ ఫోన్ల రికవరీలో అనంత పోలీసులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. భారీ స్థాయిలో ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ముట్టజెప్పడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీస్‌ టెక్నికల్‌ విభాగాన్ని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి సైతం అభినందించారు. 

ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే... 
సెల్‌ఫోన్‌ పోతే బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లకుండానే, ఎఫ్‌ఐఆర్‌తో కూడా సంబంధం లేకుండానే రికవరీ చేసి వారికి అందజేయాలనే సంకల్పంతో చాట్‌బాట్‌ సేవలను 2022 మార్చి 17న ఎస్పీ ప్రారంభించారు. వాట్సాప్‌ నంబర్‌  9440796812 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫోన్లు పోగొట్టుకున్న జిల్లా వాసులతో పాటు వివిధ ప్రాంతాల వారు ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తున్నారు.

పోలీసులు కూడా వేగంగా స్పందించి ఫోన్లు రికవరీ చేసి వారికి అందజేస్తున్నారు. సుదూర ప్రాంతాల వారు అనంతకు రాకుండానే ఫోన్లు పొందేలా ఉచిత డోర్‌ డెలివరీ సేవలను తాజాగా ప్రారంభించారు. ప్రొఫెషనల్‌ కొరియర్‌ సంస్థ సహకారంతో ఈ సేవలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటిదాకా 15 రాష్ట్రాల బాధితులకు సుమారు 400 సెల్‌ఫోన్లు రికవరీ చేసి అందించామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 18 జిల్లాల బాధితులు ఈ సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top