
ఆదిలాబాద్ టౌన్: అనుమానం పెనుభూతమై ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ పట్టణం సుందరయ్యనగర్‌కు చెందిన హింగోలి శంకర్‌కు ఇంద్రవెల్లిలోని నర్సాపూర్‌కు చెందిన వందన (45)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్లు పైబడిన ఇద్దరు కుమారులు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండగా, ఆయన భార్య గృహిణి. సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో భార్యపై అనుమానం శంకర్‌లో అశాంతి రేపింది.
టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఆరోగ్యం బాగాలేదని, క్షుద్రపూజలు చేయిస్తానని, ఆయుర్వేద మందు తాగిస్తానని చెప్పి ఈనెల 2న శంకర్ ఆదిలాబాద్ నుంచి వందనను బస్సులో తీసుకెళ్లాడు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతం (మహారాష్ట్ర సరిహద్దు)లోకి తీసుకెళ్లి చెట్లకు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నట్లు నటించాడు. వెంట తెచ్చుకున్న కారంపొడిని వందన కళ్లలో చల్లాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా బండరాయితో తలపై బాదాడు. దీంతో రక్తపు మడుగులో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మ నాన్న తిరిగి రాకపోవడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు.
శనివారం రాత్రి కూతురు ప్రియాంక టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా, అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డితో పాటు పోలీసులు వెళ్లి చూడగా ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.