అతివేగానికి ముగ్గురి ప్రాణాలు బలి  | 3 Killed In Road Accident In Narayanpet District | Sakshi
Sakshi News home page

అతివేగానికి ముగ్గురి ప్రాణాలు బలి 

Sep 26 2022 2:10 AM | Updated on Sep 26 2022 2:10 AM

3 Killed In Road Accident In Narayanpet District - Sakshi

నుజ్జునుజ్జు అయిన బైక్‌లు, నవీన్‌కుమార్‌ (ఫైల్‌), రాహుల్‌నాయక్‌(ఫైల్‌), రాజేశ్‌నాయక్‌(ఫైల్‌)

మరికల్‌: అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మరికల్‌ మండలం బండతండాకు చెందిన రాహుల్‌ నాయక్‌ (21), అమరచింత చంద్రప్ప తండాకు రాజేశ్‌ నాయక్‌(18), బూడ్యాగాని తండాకు చెందిన కిషన్‌నాయక్‌లు ఒకే బైక్‌పై బయలుదేరారు. శనివారంరాత్రి కన్మనూర్‌లో మద్యం కొనుగోలు చేసి మరికల్‌లోని ఓ హోటల్‌లో బిర్యానీ పార్శిల్‌ తీసుకొని పెట్రోల్‌ బంక్‌కు వెళ్లారు. అక్కడ పెట్రోల్‌ లేకపోవడంతో లాల్‌కోట చౌరస్తాలోని మరో బంక్‌ వద్దకు బయల్దేరారు.

అతివేగంగా వెళ్తు­న్న వీరి బైక్‌ అదుపు తప్పి, షాద్‌నగర్‌ నుంచి నారాయణపేటకు మరో బైక్‌పై వస్తున్న నవీన్‌కుమార్‌(35) అనే వ్యక్తిని తీలేర్‌ స్టేజీ దగ్గర ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్‌కుమార్, రాజేశ్‌నాయక్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాహుల్, కిషన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాహుల్‌ మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిషన్‌నాయక్‌ పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

పెద్దల పండుగకు వస్తూ..  
నారాయణపేటకు చెందిన నవీన్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమార్తె ఉన్నారు. షాద్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ ప్లాస్టిక్‌ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. నెల క్రితం మృతి చెందిన పెద్దనాన్నకు ఆదివారం పెద్దల పండుగ చేయాల్సి ఉండటంతో భార్య, కూతురిని ఆదివారం బస్సులో రమ్మని చెప్పిన నవీన్‌ శనివారం రాత్రి బైక్‌పై నారాయణపేటకు బయల్దేరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement