చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల జైలు

20 years in prison for an old man Molestation on seven years girl - Sakshi

విశాఖ లీగల్‌: ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.రామ శ్రీనివాసరావు సోమవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలు చిన్నారి కావ­డంతో నిబంధనల ప్రకారం నాలుగు లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించా­రు.

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు సారిక వెంకటరమణ (66) విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీలో ఉంటున్నాడు. అతను ఆర్టీసీలో రిటైర్డ్‌ ఉద్యో­గి.  సమీపంలోని చిన్నారులను తరచూ తన ఇంటికి పిలిచి తినుబండారాలు, చాక్లెట్లు ఇచ్చేవాడు. బాధి­తురాలు (7) కూడా అదే ప్రాంతంలో ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంటికి సమీపంలోని ఒక అపార్ట్‌మెంటులోని వాచ్‌మన్‌గా పనిచేస్తూ దుస్తులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

చిన్నారి దగ్గరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదివేది. ఈ క్రమంలో 2020 డిసెంబర్‌ 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో నిందితుడు వెంకటరమణ ఆ బాలికకు చాక్లెట్లు ఇస్తా.. అని ఆశచూపి తన ఇంటికి రప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లిన చిన్నారిని చిత్రహింసలు పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమ కుమారై కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల వెదికారు. బాలిక నీరసంగా ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువుకావడంతో సారిక వెంకటరమణకు 20 ఏళ్ల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top