పోరు సజావుగా సాగేనా..? 24 జెడ్పీటీసీ, 300 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు బరిలో 89 మంది జెడ్పీటీసీ, 702 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ గుండాయిజమే పరమావధిగా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అరాచక పర్వానికి తీసిన విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ౖపైపె ఏర్పాట్లను చూపిస్తున్నా తెరవెనుక అధికార కూటమి అరాచక శక్తులు బరితెగించేందుకు సిద్ధమయ్యాయి. పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చుకుని పోలింగ్‌ను ఏకపక్షంగా చేసుకునేందుకు రంగం సిద్ధంచేసుకున్నాయి. ప్రజా తీర్పును అధికార బూటు కాళ్ల కింద తొక్కేయాలని చూస్తున్న కూటమి అసాంఘిక శక్తులను తరిమికొట్టాలని ప్రజాస్వామ్యవాదులు పిలుపునిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో పరిషత్ ఎన్నికల పోరు తుది ఘట్టానికి చేరుకుంది. గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. గురువారం ఉదయం 7 గంటల నుంచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా టీడీపీ అరాచకాలు సాగించిన నేపథ్యంలో గురువారం జరగబోయే పోలింగ్ ప్రక్రియ ఎంత వరకు సజావుగా, ప్రశాంతంగా సాగుతుందోనని ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. పరిషత్ ఎన్నికలను జిల్లా ఎన్నికల అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడి, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు.
24 మండలాల్లో ఎన్నికలు
జిల్లా వ్యాప్తంగా 27 మండలాలు ఉండగా యాదమరి, పూతలపట్టు, బంగారుపాళ్యం జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 24 మండలాల్లోనే జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా 370 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 70 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. గురువారం 300 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల సామగ్రిని బుధవారం ఆయా మండలాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికలకు పెద్ద సైజ్ బ్యాలెట్ బాక్సులు 2,451 వినియోగిస్తున్నారు. వాటిని ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు నడుమ కేంద్రాలకు తరలించారు.
321 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు 1,138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటిలో 321 అత్యంత సమస్యాత్మక, 306 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటిపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, గొడవలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు, గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. 228 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
జెడ్పీటీసీ బరిలో 89 మంది, ఎంపీటీసీ స్థానాలకు 702 మంది పోటీ
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 791 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జెడ్పీటీసీ స్థానాలకు 89 మంది, ఎంపీటీసీలకు 702 మంది పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 24 మండలాల్లో నిర్వహిస్తున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 24 మంది, టీడీపీ అభ్యర్థులు 22 మంది, జనసేన ఇద్దరు, కాంగ్రెస్ 13 మంది, బీఎస్పీ ఐదుగురు, బీసీవై ఇద్దరు, ఇండిపెండెంట్లు 21 మంది కలిపి మొత్తం 89 మంది బరిలో ఉన్నారు. అలాగే 300 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 290 మంది, టీడీపీ 280 మంది, జనసేన 23 మంది, కాంగ్రెస్ 15 మంది, బీజేపీ ఆరుగురు, బీఎస్పీ ఆరుగురు, ఇతర పార్టీలు ముగ్గురు, ఇండిపెండెంట్లు 78 మంది కలిపి మొత్తం 702 మంది తలబడుతున్నారు.
సాధారణ పోలింగ్ కేంద్రాలు 524
సమస్యాత్మక కేంద్రాలు 306
అత్యంత సమస్యాత్మక కేందాలు 321
మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,138
మొత్తం ఓటర్లు 10,26,821 మంది
మొత్తం బ్యాలెట్ బాక్సులు 2,451
నిఘా పారదర్శకమేనా?
అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జిల్లాలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరగని పరిస్థితి. టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పరిషత్ ఎన్నికల్లో అలా కాకుండా సీసీకెమెరాలను పకడ్బందీగా అమలు చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికలకు 10,26,821 మంది ఓటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఓటరు స్లిప్పులు అందరికీ పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా, చాలా వరకు అందలేదన్న ఆరోపణలున్నాయి. బీఎల్‌వోలు సక్రమంగా స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు తమ పరిధిలోని ఓటర్లకు ఆన్‌లైన్ నుంచి స్లిప్పులను డౌన్‌లోడ్ చేసి ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో పురుషులు 5,07,703 మంది, మహిళలు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు.


