చిత్తూరు రూరల్ (కాణిపాకం): పాల ఉత్పత్తిదారుల ఆర్థిక పురోగతి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమూల్ డెయిరీ సౌత్ ఆపరేషన్స్ ప్రాంతీయ పాల సేకరణ విభాగం హెడ్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన బుధవా రం చిత్తూరు నగరంలోని అమూల్ డెయిరీలో రైతులకు 2025–26 సంవత్సరానికి సంబంధించి రూ.85.74 లక్షల బోనస్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కనీసం సగం రోజులు పాలు సరఫరా చేసిన అర్హులైన రైతులకు లీటరుకు 50 పైసల చొప్పున బోనస్ అందించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 455 పాల సేకరణ సంఘాల పరిధిలోని 9,922 మంది రైతులకు మొత్తం రూ.85,73,862 లబ్ధి చేకూరిందన్నారు. రైతులు క్రమం తప్పకుండా పాలు సరఫరా చేసేలా ప్రోత్సహించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి ఏటా బోనస్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సహకార వ్యవస్థకు రైతులే వెన్నెముక అని, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి అమూల్ డెయిరీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డెయిరీ డిప్యూటీ మేనేజర్ లక్ష్మీకాంత్, సీనియర్ ఆఫీసర్ ఉదయ్‌కిరణ్, సిబ్బంది, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.
నిజాయితీగా ఎన్నికలు
జరిగి ఉంటే ఫ్యాన్ గెలిచేది
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికలు నిజాయితీగా జరిగి ఉంటే ఫ్యాన్ కచ్చితంగా గెలిచేదని వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి చంద్రశేఖర్ తెలిపారు. ఆయన బుధవారం గిరింపేటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ పర్వం నుంచి పోలింగ్ వరకు కూటమి నాయకులు అక్రమాలు, దాడులకు పాల్పడ్డారని తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఫామ్స్ చింపేసి దౌర్జన్యం చేశారని తెలిపారు. 9 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని, నాయకులు, ఏజెంట్లను పోలీసులు అక్రమంగా నిర్బందించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ పోలింగ్ కేంద్రాలకు వచ్చారని తెలిపారు. ఆయన అండతో అల్లరిమూకలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఇంత ఘోరంగా ఎన్నికలు జరగడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంత జరిగినా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 3 డివిజన్లలో గెలిచారంటే ప్రజాబలం ఎంత ఉందో తెలుస్తోందన్నారు. పోరాటం ఇంతటితో ఆగదని, ప్రజల పక్షాన నిలబడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్, సెల్వం, పయణి తదితరులు పాల్గొన్నారు.
ఆ ఓట్లు ఎలావచ్చాయి?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నగరి మున్సిపల్ ఎన్నికల లెక్కింపు సమయంలో రాత్రికి రాత్రే దొంగ ఓట్లు తలుక్కుమన్నాయని, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫలితాలను తారుమా రు చేశారని టీడీపీ సీనియర్ నాయకుడు రామా నుజచలపతి ఆరోపించారు. ఆయన బుధవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన సీనియర్ కార్యకర్తలకు అన్యాయం చేశారని, రాత్రికి రాత్రే కండువాలు మార్చి వచ్చిన వారికి, నోట్ల కట్టల మూట లు సమర్పించిన వారికి సీట్లు, పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు మెసేజ్ పంపినంత మాత్రాన అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టే స్థాయికి దిగజారారని, నగరి ఎమ్మెల్యే టీడీపీ వారేనా అన్న సందేహం కలుగుతోందన్నారు. పత్రికలో ఇచ్చే ప్రకటనల్లో ఎంపీ ఫొటో కూడా వేయడం లేదన్నారు. ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని నీళ్లలో కలిపి మిత్రపక్షమైన బీజేపీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. స్వతంత్ర అభ్యర్థులను మానసిక క్షోభకు గురిచేశారని, మొదట కేటా యించిన గడియారం గుర్తుతో రోజుల తరబడి ప్రచారం చేసుకున్నాక, కోర్టు ఆదేశాల నెపంతో ఎయిర్ కండిషనర్ గుర్తు తీసుకోమంటూ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఫొటోతో కరపత్రాలు పంచితే కమిషనర్ తో ఫోన్ చేయించి బెదిరించారని తెలిపారు. ఓట్ల లెక్కింపులో జరిగిన దొంగ ఓట్ల అక్రమాలపై, సీనియర్లకు జరిగిన వెన్నుపోటుపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న టీడీపీ నేత రామానుజ చలపతి


