జీఎస్టీ శాఖలో వాట్సాప్ కాల్స్ దుమారం చిత్తూరుకు చెందిన వ్యాపారులతో రహస్య భేటీ? తిరుపతిలోని కల్యాణ మండపంలో సమావేశం మామూళ్ల కోసమేనంటూ వ్యాపారుల ఆరోపణలు
సాక్షి, చిత్తూరు: వాణిజ్య పన్నుల శాఖ(జీఎస్టీ)లో ఇటీవల నడిచిన వాట్సాప్ ఫోన్ కాల్స్ దుమారాన్ని రేపాయి. చిత్తూరుకు చెందిన ప్రధాన తుక్కు వ్యాపారులతో రహస్య భేటీ నిర్వహించడం.. అందరితోనూ వాట్సాప్‌లో మాట్లాడడం పలువురు అధికారులపై అవినీతి మరకలను అంటిస్తోంది.
ఆ తిమింగలం ఆహారం కోసమేనా..?
చిత్తూరు డివిజన్‌కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులు ఇటీవల పలువురు తుక్కు (పాత ఇనుప సామాన్లు) వ్యాపారులకు వాట్సాప్ కాల్స్ చేశారు. ‘రేపు తిరుపతిలో ఓ ముఖ్యమైన సమావేశం ఉంది. మీరు కచ్చితంగా రావాలి. రాకుంటే మా నుంచి మీకు ఎలాంటి సహకారం అందదు. పెద్దాయన ఈ విషయం మీకు చెప్పమన్నారు’ అంటూ ఓ 37 మంది బడా వ్యాపారులకు ఫోన్లు చేశారు. వాస్తవానికి జీఎస్టీ లైసెన్సు కలిగిన వ్యాపారులకు పర్మిట్, లావాదేవీలు, ఇతర అంశాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఏ ఒక్క అధికారి కూడా వ్యాపారులతో నేరుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ శాఖలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఓ పెద్ద తిమింగలం నెలకు రూ.కోటికి పైగా అక్రమ మార్గంలో ఆదాయం ఆర్జిస్తోంది. ఆ తిమింగలానికి మరింత ఆకలి వేయడంతో చూపు తుక్కు వ్యాపారులపై పడింది. ఈ క్రమంలో ఒక్కో వ్యాపారి రూ.25 లక్షల వరకు నెలసరి మామూళ్లు ఇవ్వాలని ఈ సమావేశంలో ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి.
ప్రైవేటు మండపం అవసరమా..
ఆన్లైన్ లావాదేవీలు వచ్చిన తర్వాత వ్యాపారుల మొహం కూడా జీఎస్టీ అధికారులు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాలసీ విషయాలు చర్చించాలనుకుంటే జీఎస్టీ కార్యాలయంలోనే దర్జాగా సమావేశం నిర్వహించవచ్చు. అలా కాదని తిరుపతిలోని ఓ కల్యాణ మండపంలో రహస్య భేటీ నిర్వహించడం ఆ తిమింగలం అవినీతి దాహానికి అద్దం పడుతోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారికి తెలియకుండా వ్యాపారులను పిలిపించిన ఆ తిమింగలం నెలసరి మామూళ్లు ఇవ్వకుంటే, తుక్కు తీసుకెళుతున్న వాహనాలను అడ్డుకుంటామని, కేసులు నమోదుచేస్తే తప్పించుకోలేరని భయపెట్టినట్లు సమాచారం. ఇక తిరుపతికి చెందిన ఓ కంపెనీ డైరక్టర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కార్యాలయానికి పిలిపించి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
తప్పుడు వ్యాపారాలు చేయొద్దని చెప్పాం
తిరుపతిలో నిర్వహించిన సమావేశం నా దేశాలతోనే జరిగింది. తుక్కు వ్యాపారాలు చేసేవాళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి తప్పుడు మార్గాల్లో వ్యాపారాలు చేయొద్దని హెచ్చరించాం. మా సిబ్బంది ఎవరిౖపైనెనా అవినీతి ఆరోపణలు ఉంటే నాకుగాని, నా పై అధికారులకు గాని ఫిర్యాదు చేయొచ్చు. కిందిస్థాయి సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం.
– హర్షవర్ధన్, జీఎస్టీ జాయింట్ కమిషనర్
వీటికి సమాధానం ఏదీ?
సమావేశాన్ని ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా కల్యాణ మండపంలో నిర్వహించడం, దీనికి అద్దె ఎవరు చెల్లించారు? అధికారుల రికార్డుల్లో దీన్ని నమోదు చేశారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. పైగా వాట్సాప్ గ్రూపు ఎవరి ఆదేశాలతో ఏర్పాటుచేశారు? తుక్కు వ్యాపారులనే ఎందుకు పిలిచారు? ఓ కంపెనీ గేటు వద్ద మూడు రోజులుగా షిప్టుల పద్ధతిలో సిబ్బందికి విధులు కేటాయించిన తిమింగలం తుక్కు తీసుకెళ్లే వాహనాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.


