అంతర్జాతీయ సదస్సులో ఎస్వీయూ ప్రొఫెసర్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సులో ఎస్వీయూ ప్రొఫెసర్‌

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

తిరుపతి సిటీ : ఎస్వీయూ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ బి.దేవప్రసాద్‌ రాజు అమెరికాలో నిర్వహిస్తున్న 7వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఆఫ్టిక్స్‌, ఫొటోమిక్స్‌ అండ్‌ లేజర్‌ సదస్సులో బుధవారం పరిశోధన ప్రసంగం చేశారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ దేవప్రసాద్‌ రాజు తన ప్రసంగంతో పాటు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్‌, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ప్రొఫెసర్‌ దేవప్రసాద్‌రాజుకు అభినందనలు తెలిపారు.

ఆదర్శంగా ‘ల్యాబ్‌’ అభివృద్ధి

తిరుమల : తిరుమలలోని వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ ల్యాబ్‌ను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి తెలిపారు. ల్యాబ్‌లో బుధవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన ల్యాబ్‌ కార్యకలాపాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలసిస్‌ ల్యాబొరేటరీలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం 34 మంది పనిచేస్తున్నారని తెలిపారు. త్వరలో మరో 8 మందిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. టీటీడీకి అవసరమైన సరుకుల కొనుగోలు దశ నుంచే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని సరుకులను తిరస్కరిస్తున్నట్లు వివరించారు. వంట పూర్తయిన తర్వాత కూడా ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ తాగునీటి నమూనాలను కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతను టెస్ట్‌ చేసేందుకు అత్యాధునిక పరికరాలు ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే నెయ్యి నమూనాలను ప్రతిరోజూ పరీక్షించిన తర్వాతే వినియోగానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆహారం, తాగునీరు అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీటీడీ హెల్త్‌ డిప్యూటీ ఈఓ సోమన్నారాయణ, ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ఉమాశంకర్‌, ల్యాబ్‌ క్వాలిటీ మేనేజర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

బోసిపోయిన

రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌

తిరుపతి అర్బన్‌ : ఎన్నికల నేపథ్యంలో సుమారు పది రోజులుగా తిరుపతి అర్బన్‌ పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆస్తులకు సంబందించి రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో బోసిపోయింది. సాధారణంగా ప్రతి రోజూ 120 నుంచి 150 వరకు ఆస్తుల క్రయ విక్రయాలకు సంబందించి రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కారణంగా రోజుకు కేవలం 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతుండడంతో కార్యాల యం ఖాళీగా దర్శనమిస్తోంది.

కార్తీక మాసం ప్రత్యేక యాత్ర

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేసినట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజనల్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడు తూ ఈ నెల 14, 21, 28 తేదీలతో పాటు డిసెంబరు 5న ఒంటిమిట్ట, అహోబిలం, మహానంది, శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ టూర్‌ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి బస్సు బయలుదేరి క్షేత్రాల సందర్శన అనంతరం తిరిగి సోమవారం ఉదయానికి తిరుపతి చేరుకోనున్నట్లు వివరించారు. ఆ ప్యాకేజీకి సంబంధించి పెద్దలకు రూ.3,500, పదేళ్ల లోపు పిల్లలకు రూ.2800 ప్రయాణ టికెట్‌ ధర ఉంటుందని వెల్లడించారు. అలాగే శబరిమలై యాత్రలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు, యాత్రల కోసం 36 సీట్ల నాన్‌ ఏసీ హైటెక్‌ బస్సులు, 45 సీట్ల ఏసీ ఓల్వో మల్టీయాక్సిల్‌ సర్వీసులను అద్దెకు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌ సంప్రదించాలని కోరారు. ఇతర వివరాలకు 0877–2289123, 9848007033, 9848802099, 9848850099 నంబర్లకు ఫోన్‌ చేయాలని, లేదా ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement