టీడీపీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తే దక్కింది ఇదేనా? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తే దక్కింది ఇదేనా?

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

అన్యాయాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా..? రెబల్‌గా పోటీ చేస్తే...ఇంట్లో మద్యం పెట్టి పోలీసులకు పట్టించారు ఇదీ టీడీపీ రాజకీయ కక్షసాధింపేనంటూ ఆవేదన

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): టీడీపీకి ఏళ్ల తరబడి పనిచేశాను, అందుకు ప్రతిఫలం.. పార్టీ నుంచి తొలగింపు.. కుట్రలు..కేసులంటూ టీడీపీ రెబల్‌ అభ్యర్థి జగదీష్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లెలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేసిన తమ కుటుంబానికి కూటమి ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. సీట్ల కేటాయింపు విషయం నచ్చక ఈ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు తెలిపారు. దిగువమాసపల్లె పంచాయతీలో టీడీపీని నిలబెట్టి గెలుపు బావుటా ఎగరవేసిన చరిత్ర తన కుటుంబానిదేనన్నారు. కష్టకాలంలోనూ పార్టీ వెంటే నిలబడ్డానని, 2019లో తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించినా వెనకడుగు వేయలేదన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించానని తెలిపారు. చిత్తూరు మండలం ఎంపీపీ జనరల్‌ స్థానం కేటాయించడంతో పార్టీలో సీనియర్‌గా తనకు ఎంపీపీ, ఎంపీటీసీ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేను, ఇతర నాయకులను కోరినట్లు తెలిపారు. పది రోజుల పాటు తనను తిప్పించుకుని, కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేశారని వాపోయారు. ముత్తుకూరు, దిగువమాసపల్లె జనరల్‌ అయినప్పటికీ.. అనంతాపురం సెగ్మెంట్‌ ఎస్సీ మహిళకు కేటాయించడంతో అనంతాపురానికి చెందిన నేత జయచంద్రనాయుడును ముత్తుకూరుకు తెచ్చి నిలబెట్టడం ద్వారా స్థానిక కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు తెరలేపారని జగదీష్‌ నాయుడు ఆరోపించారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఎకై ్సజ్‌ పోలీసులు హఠాత్తుగా ఇంటికి వచ్చి మూడు ఫ్లోర్లు, టెర్రస్‌ వరకు సోదా చేశారని తెలిపారు. ఎలాంటి అక్రమ వస్తువులు దొరకకపోవడంతో పోలీసులు వెనుదిరిగినా, ఇంటి వెనుక ఉన్న మామిడి తోపులో బూట్ల అడుగుల జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా లేబుల్‌ లేని రెండు మందు బాటిళ్ల మూటలను కాంపౌండ్‌ పక్కన పడవేసి తనపై కుట్ర పన్నారని మండిపడ్డారు. పార్టీలకతీతంగా తన వెన్నంటి ఉంటున్న ప్రజలందరూ ఈ అరాచకాలను గమనించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement