మరణంలోనూ మానవత్వం చాటిన కుటుంబం ఆరు నెలల క్రితం కళ్లు దానం చేసిన తల్లి ఇప్పుడు కొడుకు నేత్రాలు దానం కన్నీటి పర్యంతమైన జోడిచింతల గ్రామస్తులు
యాదమరి: ఆ ఇంటిలో విధి ఆర్పిన దీపం.. మరో ఇద్దరి ఇళ్లల్లో వెలుగులు నింపింది. కళ్ల ముందే చేతికొచ్చిన కొడుకు అకాల మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్నా ఆ తండ్రి, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆరు నెలల క్రితం కన్నతల్లి మరణించగా నేత్రదానం చేసిన ఆ కుటుంబం, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన కొడుకు కళ్లను కూడా దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం యాదమరి మండలంలో చోటు చేసుకుంది.
జోడిచింతల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన రెండో కుమారుడు సందీప్(34) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి సందీప్ ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను డీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నకొడుకు విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి ఆ తండ్రి, అతని కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కొడుకు ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకుంటూనే సందీప్ కళ్లతో మరొకరికి కంటి చూపు ప్రసాదించాలని కుటుంబ సభ్యులు భావించారు. సరిగ్గా ఆరు నెలల క్రితమే సందీప్ తల్లి కూడా చనిపోయింది. అప్పట్లో ఆమె నేత్రాలను దానం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ కుమారుడి కళ్లను సైతం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆరు నెలల వ్యవధిలోనే తల్లి, కుమారుడి కళ్లను దానం చేసిన ఆ కుటుంబంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ మరణంతో జోడిచింతల గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.


