మహేంద్రరెడ్డిపై మాయా అస్త్రాలు | - | Sakshi
Sakshi News home page

మహేంద్రరెడ్డిపై మాయా అస్త్రాలు

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

శాంతిపురం: మండలంలోని ఎంకె పురం ఎంపీటీసీ సెగ్మెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏ మహేంద్రరెడ్డి లక్ష్యంగా పచ్చ కుట్రలు పదునెక్కాయి. ఓటర్ల తీర్పుతో గెలుస్తామనే ధీమా లేక ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు వేశారు. గెలుపు దిశగా సాగుతున్న తనను కట్టడి చేసేందుకు పోలింగ్‌ ముందు రోజు రాత్రి వ్యవసాయ, జాతీయ రహదారుల శాఖల అధికారులను ప్రయోగించారు. శాంతిపురంలో మహేంద్రరెడ్డి కుమారుడు ప్రేమ్‌కుమార్‌ నిర్వహిస్తున్న కిసాన్‌ ఆగ్రోస్‌ దుకాణంపై వ్యవసాయ శాఖ అధికారులు దాడిచేసి సీజ్‌చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక వ్యవసాయాధికారి అమృతవల్లి, రెవెన్యూ, పోలీసు, ఇతర మండలాల వ్యవసాయాధికారులతో కలిసి బుధవారం రాత్రి 7 గంటల తర్వాత దుకాణం తనిఖీ కోసం వచ్చారు. అప్పటికే దుకాణం మూసివేసి ఉండడంతో భవనానికి నోటీసు అంటించి, సీజ్‌ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఎలాంటి అమ్మకాలు జరపరాదని స్పష్టం చేశారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో జాతీయ రహదారుల శాఖ చిత్తూరు ఈఈ శ్రీనివాస్‌, స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాసులు గుండిశెట్టిపల్లిలోని మహేంద్రరెడ్డి ఇంటి వద్దకు వచ్చారు. అభ్యర్థి ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య భవానితో మాట్లాడి శాంతిపురంలోని భవనం జాతీయ రహదారిలో ఉందని, దానిని కూల్చివేస్తామని బెదిరించారు. స్థానికులు పోగై ఎన్నికల ముందు రోజు ఇలా ఇళ్లమీదికి వచ్చి మహిళలను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు భవనం ఎలా కూల్చుతారని ఈఈని నిలదీశారు. ఏమైనా ఉంటే పోలింగ్‌ ముగిశాక మాట్లాడండని స్పష్టం చేశారు. దీంతో ఉన్నత అధికారుల నుంచి వాట్సాప్‌లో అందిన ఆదేశాల మేరకు తాను వచ్చానని, బుధవారం సాయంత్రం వరకు సమయం ఇస్తామని చెప్పి ఈఈ వెనుదిరిగారు. రాజకీయంగా పోటీ పడాల్సిన అధికార పక్షం వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మహేంద్రరెడ్డిని ఎదుర్కోలేక చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌పీ నియోజకవర్గ బూత్‌ మేనేజర్‌ విజయకుమార్‌ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement