కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఉదయం 8 గంటలకు ప్రారంభం ఓట్ల లెక్కింపునకు 400 మంది సిబ్బంది నియామకం రాత్రి 7 గంటలకు పూర్తయ్యే అవకాశం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఘట్టానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఈనెల 3 వ తేదీ (మంగళవారం) ఉదయం 8:00 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలోని చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలమనేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలో ఎంఎఫ్‌సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నగరికి సంబంధించి పుత్తూరులోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులంతా తమ తరఫున హాజరయ్యే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను సేకరించారు. ఈమేరకు కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సోమవారం విలేకరులతో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పక్కా ప్రణాళిక
ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నాం. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే మొదటగా బ్యాలెట్ పేపర్ల వర్గీకరణ చేపడతారు. కార్పొరేటర్, మేయర్ స్థానాలకు ఉపయోగించిన వేర్వేరు రంగుల బ్యాలెట్ పత్రాలను విడివిడిగా వేరు చేస్తారు. వర్గీకరణ పూర్తయిన వెంటనే కార్పొరేటర్ అభ్యర్థులు, మేయర్ స్థానానికి ఒకేసారి సమాంతరంగా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. వర్గీకరణ, బండ్లింగ్ (కట్టలు కట్టడం) లెక్కింపు నిరంతరాయంగా సాగుతాయి. సగటున 8 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.
వార్డు ఫలితాలు త్వరితగతిన..
మేయర్ ఫలితం సాయంత్రానికి..
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వార్డుల వారీగా విజేతలెవరనేది త్వరతిగతిన తెలుస్తుంది. వార్డు సభ్యుల అభ్యర్థుల ఫలితాలను ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు. వార్డు ఫలితాలన్నీ పూర్తయిన తర్వాత, చివరలో మేయర్ స్థానానికి సంబంధించిన తుది ఫలితాన్ని అధికారికంగా వెల్లడిస్తాం. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా సాయంత్రం 6 నుంచి 7 గంటల కల్లా ముగిసిపోతుందని అంచనా వేస్తున్నాం.
భారీ బందోబస్తు.. 400 మంది సిబ్బంది రంగంలోకి!
లెక్కింపు ప్రక్రియను ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టాం. ఓట్ల లెక్కింపు విధి నిర్వహణకు దాదాపు 400 మంది అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. 400 మంది కౌంటింగ్ సిబ్బందికి అదనంగా, ఎలాంటి ఘర్షణలు, అసౌకర్యం కలగకుండా కౌంటింగ్ కేంద్రం వెలుపల, లోపల మూడంచెల భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశాం. కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చే ఏజెంట్లు, అభ్యర్థులు అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తాం.


