చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ కోసం 1,384 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. చిత్తూరు (పీవీకేఎన్), కుప్పం (డిగ్రీ కాలేజీ), పలమనేరు (వృత్తి విద్యా కాలేజీ ), నగరి (సిద్ధార్థ కాలేజీ) కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని, ఆర్వో అనుమతి ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.


