నిజంగా అభివృద్ధి చేస్తే.. గెలవలేరా.? | - | Sakshi
Sakshi News home page

నిజంగా అభివృద్ధి చేస్తే.. గెలవలేరా.?

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

● భయంతో ఎందుకు రిగ్గింగ్‌లు చేశారు ● ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దౌర్జన్యాలు ● ప్రజలు భయపడిపోయారు ● విజయానందరెడ్డి ఆవేదన

చిత్తూరు కార్పొరేషన్‌: గత 30 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధి చిత్తూరులో చేశాం.. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి వసతులు కల్పించామంటూ డప్పు కొట్టుకునే ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ పోలింగ్‌ సమయంలో రిగ్గింగ్‌ ఎందుకు చేయించారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రశ్నించారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏజెంట్లు, నాయకులను పోలీసులు ఎందుకు అక్రమంగా నిర్బంధించారన్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే డైరెక్షన్‌లో దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసి ఓటు వేసే వాతవారణం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికి ప్రజలే భవిష్యత్‌లో తగిన బుద్ధి చెబుతారన్నారు. రిగ్గింగ్‌ జరిగినట్లు వీడియో బయటకు వచ్చినప్పటికీ అధికారులు ఎందుకు రీపోలింగ్‌ పెట్టలేదని ప్రశ్నించారు. చిత్తూరు పేరును రాష్ట్ర వ్యాప్తంగా చెడగొట్టారని మొదలియార్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌ విమర్శించారు. ఎమ్మెల్యే, టీడీపీ మేయర్‌ అభ్యర్థి కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నాయకత్వంలో పలు డివిజన్లలో దొంగఓట్లు వేశారని ఆరోపించారు. పోలింగ్‌ సరళని పరిశీలించే సాకుతో ప్రతి పోలింగ్‌ కేంద్రానికి వారు వెళతూ దొంగ ఓటర్లను కూడాతీసుకుపోయారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ధర్మరాజు మాటలు మాట్లాడిన దొరబాబు అధికార పక్షంలో ఎందుకు పాటించడం లేదన్నారు. మైనర్ల చేత ఓట్లు వేయించిన ఘనత ఎమ్మెల్యేకి దక్కుతుందని మైనార్టీ నాయకులు మున్నా ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న చిత్తూరు వాతవారణానికి భయానకంగా మార్చరని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్‌) రాహుల్‌రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్‌, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి, నాయకులు మధురెడ్డి, సయ్యద్‌, చల్లాముత్తు, టిమ్ము, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement