మురసు తుపాను హెచ్చరిక | - | Sakshi
Sakshi News home page

మురసు తుపాను హెచ్చరిక

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

● రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు సూచనలు

● రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు సూచనలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మురసు తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. రైతులు పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు తక్షణమే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను వాతావరణాన్ని బట్టి వీలైనంత త్వరగా కోసి, ధాన్యం తడవకుండా సురక్షిత ప్రదేశాలకు తరలించి టార్పాలిన్లతో కప్పుకోవాలని సూచించారు. పక్వానికి వచ్చిన పత్తి, ఎర్ర మిరపకాయలను వర్షానికి ముందే ఏరుకోవాలని సూచించారు. కోత దశలో ఉన్న మినుము, పెసర, వేరుశనగ పంటలను కోసి గాలి ప్రసరణ ఉన్న చోట ఆరబెట్టాలని పేర్కొన్నారు. పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉంటే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే మురుగు కాలువలను శుభ్రం చేసి నీటిని బయటకు మళ్లించాలని ఆదేశించారు. అరటి గెలలు, బొప్పాయి, కూరగాయల మొక్కలు పడిపోకుండా కరల్ర మద్దతు ఇవ్వాలని తెలిపారు. వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గే వరకు ఎలాంటి ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేయవద్దని స్పష్టం చేశారు. పశువులు, జీవాలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితమైన ఎత్తయిన ప్రదేశాలకు తరలించి, పశుగ్రాసం తడవకుండా చూసుకోవాలన్నారు. తుపాను సమయంలో ఈదురు గాలులు, మెరుపులు ఉన్నప్పుడు రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ పొలాల్లోకి వెళ్లకూడదని, చెట్లు, విద్యుత్‌ స్తంభాల కింద నిలబడరాదని కోరారు. పంట కంటే ప్రాణభద్రతే ముఖ్యమని గుర్తించాలని, వర్షాలు తగ్గిన తర్వాత పొలాల్లోని నీటిని బయటకు తోడేసి పంట నష్టం వివరాలను స్థానిక వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు.

తుపాను వేళ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం):తుపాను హెచ్చరికల నేపథ్యంలో వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆయన వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రసవ తేదీ దగ్గరపడిన గర్భిణులను వెంటనే సీహెచ్‌సీ లేదా జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద, నవంబర్‌ 5న జరగనున్న పరిషత్‌ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సైక్లోన్‌, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు, ఆస్పత్రుల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు వెంకట ప్రసాద్‌, అనిల్‌ కుమార్‌, అనూష, జార్జ్‌, మోహన్‌ బాబు పాల్గొన్నారు.

తుపానుపై కంట్రోల్‌ రూమ్‌

చిత్తూరు కార్పొరేషన్‌: మురసు తుపాను నేపథ్యంలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ తెలిపారు. తాగునీటి సమస్యలు ఏర్పడితే 08572–233098 నంబరును సంప్రదించాలన్నారు. ఈనెల 5వరకు కార్యాలయ పనివేళ్లలో తాగునీటి సమస్యలు వస్తే ఆ నంబర్‌కు ఫోన్‌చేసి చెబితే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement