తిరుపతి అన్నమయ్యసర్కిల్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం హత్య చేసిందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ద్వజమెత్తారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, మహిళా అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని దుశ్శాసన పర్వాన్ని కొనసాగించడంపై ఆయన మండిపడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలు ప్రతిచోటా జరిగాయన్నారు. బీహార్‌ను మించి దాడులకు దిగడం అధికార పార్టీ దుశ్చర్యలకు నిదర్శనమన్నారు. దీనికారణంగానే రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో నామినేషన్లు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు తిరుపతిలో 18 వార్డులకు 20 మంది పోలీసుల సమక్షంలో కలెక్టరేట్లో నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు, అధికార యంత్రాంగం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులకు దాసోహం కావడమేనన్నారు. పోలీసులు ఉన్న చోటనే సంఘ విద్రోహులు నామినేషన్లు అడ్డుకుంటున్నా ప్రేక్షక పాత్ర పోషించారన్నారు.
గుండాల చేతిలో రాష్ట్రం చిక్కుకుంది
ఈరోజున రాష్ట్రం టీడీపీ గుండాల చేతుల్లో పడి చిక్కుకుందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా నందలూరులో ఏకంగా అధికార పార్టీకి చెందిన నేత కోడూరు బాలసుబ్రమణ్యం వాళ్ల అమ్మని నామినేషన్ వేయించే క్రమంలో నామినేషన్ కేంద్రం వద్ద అదే పార్టీకి చెందిన వారితోనే గొడవపడ్డారన్నారు. ఈ కొట్లాటలో ఆయన తన రివాల్వర్ గాల్లో కాల్చి స్వైర విహారం చేశారన్నారు. ఆయన చేతిలోని తుపాకీని 2024 ఎన్నికల సమయం నుంచి తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎందుకు రికవరీ చేసుకోలేదని ప్రశ్నించారు.


