రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరని అంటుంటారు. చిత్తూరులో టీడీపీ నేతలు అదే మాటను నిజం చేశారు. ఫోర్జరీ సంతకాలతో పలువురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయించేశారు. అక్కడితో ఆగకుండా కూటమి పక్షాలైన జనసేన, బీజేపీ అభ్యర్థులకు సైతం నిస్సంకోచంగా కుచ్చుటోపీ పెట్టి మిత్రద్రోహానికి పాల్పడ్డారు. దీంతో ఆ పార్టీల నేతలు సైతం పచ్చమూక కుతంత్రాలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
సాక్షి, చిత్తూరు : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 51 డివిజన్ల కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ)లు డిక్లరేషన్లు ఇవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ–47, జనసేన–2, వైఎస్సార్‌సీపీ–1, బీజేపీ అభ్యర్థి 1 స్థానంలో ఏకగ్రీవం అయినట్లు పేర్కొన్నారు. ఏకగ్రీవమైన 51 డివిజన్లలో ఏ ఒక్క అభ్యర్థి కూడా తాము, తమ ప్రతిపాదకులు నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎవరికీ లేఖలు ఇవ్వలేదని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు రోడ్డెక్కారు. పోటీలో ఉన్న తమ పార్టీలకు చెందిన అభ్యర్థుల సంతకాలను టీడీపీ నేతలే ఫోర్జరీ చేశారని వాపోతున్నారు. రాష్ట్రం మొత్తం కూటమిలో మూడు పార్టీలు ఉంటే, చిత్తూరులో కేవలం టీడీపీ ఒక్కటే పెత్తనం చెలాయిస్తూ తమకు ద్రోహం చేసిందని మండిపడుతున్నారు.
ఆర్‌ఓలపై ఆరోపణలు
జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అభ్యర్థుల దొంగ సంతకాలతో ఉపసంహరణ లేఖలు ఆర్‌ఓలకు ఇవ్వడం, ఒరిజినల్ అభ్యర్థులు, ప్రతిపాదకులు కారని తెలిసినా.. వాటిని ఆమోదించడంపై అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆర్‌ఓల పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకగ్రీ వం కోసం వసూలు చేసిన మొత్తంలో ఆర్‌ఓలకు ఎంత ముట్టిందని బాధిత అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవాల వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు స్పష్టం చేస్తున్నారు.
నీతిమాలిన రాజకీయం
కమ్యూనిస్టులు అంటే ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లు. దళితుడైన మా పార్టీ అభ్యర్థిని పోటీలో లేకుండా చేసి, దొంగ సంతకాలతో విత్‌డ్రా నాటకం ఆడారు. చిత్తూరు ఎమ్మెల్యేవి నీతిమాలిన రాజకీయాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారా..? ఆయనకు దమ్ముంటే టీడీపీ అభ్యర్థిని, కమ్యూనిస్టు అభ్యర్థిపై పోటీకి దించాలి. ఆర్‌ఓ సైతం 51 ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారు..? ఆయనకు ఎంత ముట్టింది...? తప్పుచేసిన ప్రతీ ఒక్కరినీ కోర్టు ముందు నిలబెడతాం.
– రామానాయుడు, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నేత
ఆర్‌ఓలదే బాధ్యత
బీజేపీ కోసం దశాబ్దాలుగా జెండా మోశా. కూట మి ధర్మం అని చెప్పడంతో టీడీపీతో కలిసి పనిచేశా. నామినేషన్ వేసి, బీ– ఫారమ్ అందజేస్తే.. నేను నామి నేషన్ విత్‌డ్రా చేసుకున్నట్లు చెప్పారు. నేను, నా ప్రతిపాదకుడు ఎక్కడా విత్ డ్రా ఫారమ్ ఎవరికీ ఇవ్వలేదు. దీనికి పూర్తి బాధ్యత ఆర్‌ఓలదే.
– షణ్ముగం,
39వ డివిజన్ బీజేపీ అభ్యర్థి
ఏకగ్రీవానికి బేరం!
చిత్తూరులోని 60 డివిజన్లలో టీడీపీ–38, జనసేన–14, బీజేపీ–8 స్థానాల్లో పోటీ చేయాలని తొలు త ఓ అంగీకారానికి వచ్చారు. ఎన్నికలకే వెళ్లకుండా దొంగ సంతకాలతో నామినేషన్లకు ఉపసంహరించుకుని, ఏకగ్రీవం చేయడానికి ఎంత ఇవ్వాలనే దానిపై చిత్తూరుకు చెందిన ప్రజాప్రతినిధి ఇంట్లో చర్చలు జరిగినట్లు సమాచారం. ఒక్కో కార్పొరేటర్ స్థానానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్ష లు ఏకగ్రీవం కోసం ఇవ్వాలని బేరసారాలు సాగినట్లు తెలిసింది. కానీ, తాము అంత ఇవ్వలేమని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓట్ల రూపంలో వచ్చే తీర్పును గౌరవిస్తామని జనసేన, బీజేపీ పార్టీలు చర్చల నుంచి బయటకు వచ్చేశాయి. జనసేనకు చెందిన ఓ నాయకుడు మాత్రం తనకు ఏకగ్రీవం కావాలని ప్రజాప్రతినిధికి రూ.27 లక్షలు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. తన సతీమణిని గెలిపించుకోవడానికి కమల బాబు ఏకంగా రూ.18 లక్షలు అందచేసి ఏకగ్రీవం చేసుకున్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ నుంచి పోటీచేసే 11 మంది అభ్యర్థులకు పవన్ కల్యాణ్ జారీ చేసిన బీఫారాలను స్థానిక పీఓసీ చిత్తూరు నేత ఆరణి కవిత ఎన్నికల అధికారులకు అందచేశారు. కానీ, ఉపసంహరణ రోజున ముగ్గురు జనసేన అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నట్లు ఆర్‌ఓలు ప్రకటించారు. దీనిపై ఆమె ఎన్నికల సంఘానికి, అధికారులకు ఫిర్యాదు చేశారు. బీజేపీకి సంబంధించి 15 మంది నామినేషన్లు వేస్తే, ఒక్కరు మాత్రమే పోటీలో ఉన్నట్లు, మరొకరు ఏకగ్రీవం అయినట్లు చూపించారు. 13 మంది బీజేపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి అక్కడ కూడా టీడీపీ అభ్యర్థులే గెలిచినట్లు ప్రకటించుకున్నారు.


