వేలానికి ‘కూటమి’ బీఫామ్స్‌ | - | Sakshi
Sakshi News home page

వేలానికి ‘కూటమి’ బీఫామ్స్‌

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

● జెడ్పీటీసీకి ఓ రేటు.. ఎంపీటీసీకి మరో రేటు ● రూ.25 లక్షల నుంచి రూ.కోటి పలుకుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ● టీడీపీ, జనసేన నేతలు అడిగినంత ఇచ్చిన వారికే అవకాశం ● ఆ మేరకు బేరసారాలు సాగిస్తున్న కూటమి నేతలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రజల్లో పట్టు.. పార్టీ కోసం పనిచేసిన అనుభవం.. స్థానిక సమస్యలపై అవగాహన.. ఇవన్నీ పక్కనపెట్టి, ఎంత చెల్లించగలరన్నదే అభ్యర్థుల ఎంపికకు కొలమానంగా మారుతోందా?.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీకి బీఫామ్‌ దక్కాలంటే లక్షలు సమర్పించుకోవాల్సిందేనా?..తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వేర్వేరు ధరలు నిర్ణయించి, అడిగిన మొత్తం ఇచ్చిన వారికే బీఫామ్స్‌ కేటాయిస్తామనడంపై ఆ పార్టీల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతల తీరుపై మండిపడుతున్నారు. స్థానిక సంస్థల మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు వేసిన వారికి ఆయా పార్టీలు బీఫామ్స్‌ ఇవ్వాల్సి ఉంది. కూటమి అభ్యర్థిగా బీఫామ్స్‌ కావాలంటే.. ఆ పార్టీ నాయకుడు అడిగినంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాన్ని బట్టి రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.

సేవకు కాకుండా.. సొమ్ముకే ప్రాధాన్యమా?

పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల ఆర్థిక స్తోమతే ప్రధాన అర్హతగా మారింది. జెడ్పీటీసీకి ఒక మొత్తం, ఎంపీటీసీకి మరో మొత్తం చొప్పున నిర్ణయించి బీఫామ్స్‌ను విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి పరిధిలో ఈ బేరసారాలు తీవ్రంగా నడుస్తున్నట్లు కూటమి పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పేడు మండల జెడ్పీటీసీ అభ్యర్థికి బీఫామ్‌ కావాలంటే రూ.కోటి డిమాండ్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అంత లేకపోవడంతో రూ.75 లక్షలు ముట్టుజెప్పినట్లు తెలిసింది. అదే మండలం ఎంపీపీ కావాలంటే రూ.కోటి ఇస్తే.. అభ్యర్థిగా ప్రకటిస్తామని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు ఎంపీపీ కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడిని కాదని, అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమైన వ్యక్తికి కోరుకున్న ఎంపీటీసీ స్థానాన్ని రిజర్వు చేయించారు. ఆ వ్యక్తినే ఎంపీపీని చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. తణంపల్లి పరిధిలో ఇద్దరు సోదరుల మధ్య పోటీ నెలకొనడంతో ఇదే తరహాలో డీల్‌ జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. తిరుపతి నగరంలోనూ కార్పొరేటర్‌ అభ్యర్థుల నుంచి కూటమి నేతలు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే వార్డుకి ఇద్దరు నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని కూటమి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు అభ్యర్థులకు బీఫామ్స్‌ ఇచ్చే విషయంలో కొంత నగదు డిమాండ్‌చేసి తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కార్యకర్తల శ్రమకు విలువేదీ?

అడిగిన మొత్తం ఇచ్చిన వారికే అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని తేల్చిచెప్పడంతో.. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల శ్రమకు విలువేముందని ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో సంబంధాలు, స్థానికంగా చేసిన పని కంటే ఆర్థిక బలానికే ప్రాధాన్యమిస్తే సాధారణ కార్యకర్తలమైన తమ పరిస్థితి ఏంటని వెంకటగిరికి చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సూళ్లూరుపేట పరిధిలోనూ ఇదే తరహాలో డబ్బు సంచిని బట్టి బీఫామ్‌ ఇచ్చేలా బేరం కుదురిందని విశ్వసనీయ సమాచారం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను బెదిరించి.. నామినేషన్లు వేయకుండా చించివేసి.. ఆపై కూటమి పార్టీ ఆశావాహుల నుంచి బేరం మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement