‘కడా’ పీడీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌ | - | Sakshi
Sakshi News home page

‘కడా’ పీడీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది వరకు కడా పీడీగా పనిచేసిన వికాస్‌ మర్మత్‌ ఇటీవల బెంగళూరులోని ఓ పబ్‌లో మద్యం సేవించి అక్కడి పోలీసులపై చిందులేసిన విషయం విధితమే. ఈ విషయంలో ఆయనపై కేసు సైతం నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన వైరల్‌ కావడంతో బాధ్యతయుతమైన పోస్టులో ఉన్న ఐఏఎస్‌ అధికారిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సీఎం ప్రాతినిధ్యం వహించే కుప్పంలో పీడీగా పనిచేస్తున్న వికాస్‌మర్మత్‌పై అనేక ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం వెంటనే పీడీ వికాస్‌ మర్మత్‌ను జీఏడీలో రిపోర్ట్‌ చేయాలంటూ ఈ నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కడా పీడీ పోస్టుకు ఇన్‌చార్జిని నియమించాలంటూ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీని ఆదేశించింది. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌కు కడా పీడీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కలెక్టర్‌కు ఏ–ఫారమ్‌ అందజేత

చిత్తూరు కలెక్టరేట్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఏ ఫారమ్‌, బీ ఫారమ్‌ను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీకి అందజేశారు. శనివారం ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అధికారుల పరిశీలనలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌ తో పలు అంశాలపై చర్చించారు.

జోరుగా నామినేషన్లు

– మేయర్‌కు 8.. వార్డులకు 216

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని మేయర్‌ స్థానంతో పాటు 60 వార్డుల సభ్యుల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. శుక్రవారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొదటి రెండు రోజుల్లో అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు నమోదైనట్లు అదనపు ఎన్నికల అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్‌ పదవికి సంబంధించి రెండు రోజుల్లో మొత్తం 8 దరఖాస్తులు రాగా, అందులో వైఎస్సార్‌సీపీ నుంచి 1, టీడీపీ– 4, కాంగ్రెస్‌– 1, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇక 60 వార్డులకు సంబంధించి మొత్తం 216 నామినేషన్లు నమోదయ్యాయి. వార్డుల పోరులో వైఎస్సార్‌సీపీ తరఫున అత్యధికంగా 93 నామినేషన్లు దాఖలు చేయగా, టీడీపీ– 75, జనసేన– 18, బీజేపీ– 9, యంగ్‌ జనతాదళ్‌ (సెక్యులర్‌) నుంచి 1, ఎస్‌డీపీఐ– 1, 19 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉందని, పోటీ చేయదలచినవారు నిర్ణీత గడువులోగా తమ నామినేషన్‌ పత్రాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement