పుత్తూరు : పుత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో టీడీపీ నేత డీఎస్ ఏలుమలై (అమ్ములు) జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ మేరకు నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే అభ్యర్థిత్వం మాత్రమ టీడీపీ నేతకే కట్టబెట్టడంపై జనసైనికులు రగిలిపోతున్నారు.
గుంబనంగా టీడీపీ నేతలు
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ వచ్చిన సీనియర్ నేతలందరూ ఏలుమలై ఎంపికపై గుంబనంగా ఉన్నారు. ఇప్పటికే ఒక పర్యాయం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మున్సిపల్ చైర్మన్ పదవిని అలంకరించారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి సీటును కేటాయించడంపై జనరల్ కేటగిరి నుంచి పదవిని ఆశిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇరు పార్టీల్లోని నేతలు, కార్యకర్తల అసంతృప్తి నడుమ ఏలుమలై గెలుపొందడం అంత సులభం కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఆగ్రహంలో జనసేన నేతలు
జనసేన పార్టీ జెండాను ఆదినుంచి మోసిన నాయకులకు మున్సిపల్ చైర్మన్ సీటు తమ పార్టీకే దక్కిందన్న ఆనందం, అంతలోనే ఆవిరైపోయింది. పొత్తులో భాగంగా వస్తున్న అవకాశాలను పవన్ కల్యాణ్ సద్వినియోగం చేసుకుని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు యత్నించకపోవడంపై జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలే పోటీకి దిగుతుంటే ఏం చేయాలని నిలదీస్తున్నారు. ఈమాత్రం దానికి పార్టీకి సీట్ల కేటాయింపులు ఎందుకు? దానిపై ప్రకటనలు ఎందుకంటూ మండిపడుతున్నారు.


